ఖానాపురం, జనవరి 30: రోడ్డు ప్రమాదం కేసులో బాధితుల బెదిరింపులకు భయపడి పురుగుల మందు తాగి గీత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని రాగంపేటలో జరిగింది. ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యడి కృష్ణ (40) 2021 సంవత్సరంలో ఖానాపురం పాత మజీదు వద్ద బైక్‌తో నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన చినబాబును ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈ విషయంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
బాధిత కుటుంబానికి కొంత నగదు చెల్లించి కాంప్రమైజ్ చేసుకుంటామని గతంలో ఒప్పందాలు చేసుకున్నారు. ఇదే కేసు ప్రస్తుతం ఫైనల్‌కు వచ్చింది. ఈ నెల 29న కృష్ణ తాటిచెట్టు ఎక్కడానికి రాగా చినబాబుకు సంబంధించిన బంధువులు ఆరుగురు వచ్చి గతంలో కన్నా అధిక మొత్తంలో రూ.10 లక్షలు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకోవాలని, లేని పక్షంలో నిన్ను, నీ భార్యాపిల్లలను చంపుతామని బెదిరించారు.
దీంతో మనస్తాపానికి గురైన కృష్ణ బుధవారం ఇంటి వద్ద సెల్ఫీ వీడియోలో తనను, తన భార్యాపిల్లలను ఆరుగురు వ్యక్తులు చంపుతామని బెదిరించినందుకే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించి గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్‌లోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రస్తుతం అతడి సూసైడ్ వీడియో వైరల్ అవుతోంది.