గీసుగొండ, జనవరి 23 : ఇండ్లు లేని వారికి ఇవ్వకుండా ఉన్న వారి పేర్లను ఎలా చేర్చారని కలెక్టర్ ఎదుట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గంగదేవిపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభకు కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి హాజరు కాగా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, రైతు భరోసాలో ఎంపికైన వారి లిస్టును అధికారులు చదివి వినిపించారు. దీంతో రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు ఎందుకు రాలేదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. లిస్టు అంతా తప్పులతడకగా రూపొందించారని మండిపడ్డారు. అధికారులు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.
ఆదర్శ గ్రామానికి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని, కొత్త పింఛన్లు రావడం లేదని, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు ఉన్నా పెన్షన్ ఇవ్వడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా చాలా మందికి విద్యుత్, గ్యాస్ సబ్సిడీ రావడం లేదని లబ్ధిదారులు త మ గోడును వెల్లబోసుకున్నారు. టెక్నికల్ సమస్యలున్నాయని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మీ పథకంలో మంజూరైన ఇండ్లను ఇందిరమ్మ పథకంలో తీసుకుంటామన్నారు. గ్రామాల్లో అధికారులు గుర్తించి ఆ లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో రాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి సురేశ్, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీవో కృష్ణవేణి, ఏవో హరిప్రసాద్బాబు, ఏవోలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అంతా మోసం
కేసీఆర్ పాలనే బా గుండేది. కాంగ్రెస్ పాలనలో అంతా మోసం. ఊకల్ రైతు సహకార సంఘంలో నా పేరిట రూ. 90 వేల వ్యవసా య రుణం ఉంది. మూ డు నెలల నుంచి బ్యాం కు చుట్టూ తిరుగుతున్నా మాఫీ కాలేదు. సర్పంచ్ ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నది. గత కేసీఆర్ హయాంలో నాకు రూ. 25 వేల రుణం మాఫీ అయింది. రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీతో పాటు రైతు బంధు ఎగ్గొట్టింది. నాతో పాటు చానా మందికి రుణమాఫీ కాలేదు. కలెక్టర్ మాత్రం సొసైటీలో టెక్నికల్ సమస్య ఉంది.. దాంతో చాలా మందికి రుణమాఫీ కాలేదు.. అర్హులైన రైతులు దరఖాస్తులు ఇస్తే ప్రభుత్వానికి పంపుతామని చెప్పింది. రూ. రెండు లక్షల పైన ఉన్న డ బ్బులు చెల్లించినా మాఫీ కాలేదని, ఎప్పుడు చేస్తారని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది.
– కూసం రాజారాం, రైతు, గంగదేవిపల్లి, వరంగల్