శాయంపేట, సెప్టెంబర్ 19: బీఆర్ఎస్ హయాం లో తాము ప్రారంభించిన పనులకే మళ్లీ శిలాఫలకా లు వేయడమే అభివృద్ధా? అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నట్లు చూపాలంటే ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి కొత్తగా శిలాఫలకాలు వేసి పనులు చేపట్టాలన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం, కొప్పుల పరిధిలో శుక్రవారం గండ్ర పర్యటించారు. శిథిలావస్థలో ఉన్న చలివాగు ప్రధాన కాల్వ, మైలారం పెద్దచెరువు కట్టను పరిశీలించారు. కొప్పుల శివారు చలివాగు సమీపంలో కొప్పుల-పరకాల బీటీ రోడ్డు పనులు, బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని సందర్శించారు.
పనులు ఎందుకు ఆగిపోయాయని కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అక్కడ ఇటీవల కొత్తగా వేసిన శిలాఫలకాలను పరిశీలించారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ శాయంపేట, రేగొండ మండలాల్లో గ తంలో తాము ప్రారంభించిన పనులకే ఎమ్మెల్యే కొ త్త శిలాఫలకాలు వేస్తున్నారని, దీనిని ప్రజలు హర్షించరన్నారు. కొప్పుల-పరకాల రోడ్డుకు అప్పటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రూ. 5.85 కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి ఎస్టీఎస్డీఎఫ్ నుంచి రూ. 5. 74 కోట్లు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిలిపివేశారన్నారు.
అయితే అదే పనిని మళ్లీ ప్రారంభించారన్నారు. అలాగే శిలాఫలకాలపై ఫొటోలు ఎక్కడా పెట్టకోవడం లేదని, ఇది చట్ట విరుద్ధమన్నారు. తాను రూ. 1.60 కోట్లతో టెండర్లు పూర్తిచేసిన హుస్సేన్‌పల్లి-మైలారం రోడ్డు ను అధికార పార్టీ నేతల భూములు పోకుండా చెరువు వైపు వేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడున్న శ్మశానవాటిక స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారన్నారు.
మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని, అందులో భాగంగానే తహసీల్దార్‌ను ఇక్కడి నుంచి పంపించారని గండ్ర అన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు మేకల శ్రీనివాస్, మైలా రం మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్, కొప్పుల అధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు, రాంశెట్టి లక్ష్మారెడ్డి, దైనంపెల్లి సుమన్, దూదిపాల తిరుపతిరెడ్డి, సోషల్‌మీడియా మండల కన్వీనర్ దాసి శ్రావణ్‌కుమార్, పసుల ప్రవీణ్, అట్ల తిరుపతి తదితరులున్నారు.