గణపురం, నవంబర్ 3 : మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు వేగవంతంగా అందాలనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఎన్ఎంలకు స్కూటీలు అందజేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2023లో మొదటి విడతగా నాటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్‌మిశ్రా భూపాలపల్లి నియోజకవర్గంలో 10 మంది, మంథని నియోజకవర్గంలో 10 మంది ఏఎన్ఎంలకు సూటీలు ఇచ్చారు. అందులో భాగంగానే గణపురం పీహెచ్సీ పరిధిలోని సీతారాంపురం సబ్ సెంటర్‌కు సైతం సూటీని కేటాయించారు.
దీనిని సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా సబ్ సెంటర్ పనులకు ఉపయోగించకుండా సదరు ఏఎన్ఎం తన గ్రామానికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మారుమూల గ్రామా ల్లో వేగంగా వైద్య సేవలందించేందుకు స్కూటీపై త్వరగా వెళ్లాల్సి ఉండగా, ప్రైవేట్ వాహనాల్లో రావడంతో వైద్యం ఆలస్యంగా అందుతున్నదని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తిని సొంతానికి వాడుకుంటున్న ఏఎన్ఎంపై కఠిన చర్యలు తీసుకొని, సూటీని తక్షణమే సబ్ సెంటర్‌కు తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్, సంబంధిత వైద్యశాఖ అధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.