శాయంపేట, అక్టోబర్ 5 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన శాయంపేటలోని బీసీ కాలనీలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులు అందజేసి, వాటిలోని అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం శాయంపేట సెంటర్లో జరిగిన సభలో వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి.., ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నా రు. 22నెలల కాలంలో రైతు భరోసాతో రైతులకు, నిరుద్యోగులకు బాకీ పడిన మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓట్లకోసం వచ్చే నాయకులను ‘బా కీ చెల్లించు.., ఓటు అడుగు’ అని నిలదీయాలన్నారు. 22నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభు త్వం రూ.2లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, వాటితో ఏం నిర్మాణాలు చేశారు.., ఏ ఆస్తులు సృష్టించారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ బాకీ పడిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘చేతి గుర్తుకు ఓటు వేయండి’.. అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుంచి వాటిని వసూలు చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలన లో సకాలంలో ఎరువులు అందించి, పండిన పంటను కొనుగోలు కేంద్రాలు ద్వారా కొనుగోలు చేశామన్నారు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి సన్నబియ్యానికే ఇస్తామని ఇప్పటికీ రూ.వెయ్యి కోట్ల బోనస్ డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపించారు.
కేసీఆర్ ఆనాడే చెప్పారని.., కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే మళ్లీ ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్లో ఉంటాయని, కష్టాలు తప్పవని చెప్పారని, ఇప్పుడు అదే నిజమైందని, ప్రజలు ఆలోచించాలన్నారు. అప్పులు చేశారని బద్నాం చేస్తున్న కాంగ్రెస్ పాలకులు ఒకసారి రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూడాలన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నదన్నారు. రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో నిలువదని తెలిసినా ఎన్నికలకు వెళ్లడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తరిమికొట్టకపోతే తనను మించిన వారు లేరని బలుపు పెరిగిపోతుందని, ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి, రామ్శెట్టి లక్ష్మిరెడ్డి, దైనంపల్లి సుమన్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.