ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో కొలువులకు మస్తు డిమాండ్ ఉంది. 32 పోస్టుల కోసం 2వేలకు పైగా దరఖాస్తులు రావడంతో పైరవీలూ అదే స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. డీ-సెక్షన్ హాల్ అటెం డెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలో అధికారులతో కమిటీ వేసినప్పటికీ అధికార పార్టీ నాయకులు, దళారులతో పైరవీతో జాబ్ దక్కించుకునేందుకు ఉద్యోగార్థులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో పోస్టుకు వందల సంఖ్యలో పోటీ ఉండడం, రూ. లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఖాళీలను భర్తీ చేసేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ములుగు జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్నది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా మెడికల్ కాలేజీకి అవసరమయ్యే సిబ్బంది నియామకాలతో పాటు పరికరాలను కొనుగోలు చేసే పనులను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా 32 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలో గత నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసి 17 నుంచి 22వ తేదీ వరకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆరు విభాగాల్లో 32 ఉద్యోగాలకు 2,191 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెడికల్ కాలేజీలో పనిచేసేందుకు నాలుగు డీ-సెక్షన్ హాల్ అటెండెంట్ పోస్టులకు 46 మంది, పది డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 626 మంది, 8 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 1,219 మంది, నాలుగు థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు 57మంది, నాలుగు ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు 131మంది, రెండు రికార్డు అసిస్టెంట్ పోస్టులకు 112మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
మెడికల్ కాలేజీ ఉద్యోగాల భర్తీలో 32 పోస్టులకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడంతో ఒక్కో పోస్టు మార్కెట్లో లక్షల రూపాయలు పలుకుతున్నది. కలెక్టర్ నేతృత్వంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఇతర అధికారులతో ఉద్యోగాల భర్తీ కోసం కమిటీ వేశారు. కమిటీ ద్వారా అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ దళారుల ప్రమేయం, అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఉద్యోగాలను పొందేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. కొందరు తమకు తెలిసిన నాయకులను సంప్రదించి డబ్బులను పెట్టేందుకు ముందుకురావడంతో దీన్ని ఆసరా చేసుకున్న సంబంధిత నాయకులు లక్షల్లో డబ్బులను డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో పోస్టుకు వందల సంఖ్యలో పోటీ ఉండడంతో కొందరు అభ్యర్థులు నాయకులు డిమాండ్ చేసిన డబ్బులను రెడీ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. చివరకు వడ్డీ వ్యాపారులు, గిరిగిరి ఇచ్చే వారి వద్దకు వెళ్లి బతిమిలాడుతున్నట్లు సమాచారం. ఉన్నత విద్య చదివిన వారు సైతం తమ టాలెంట్, మెరిట్‌ను నమ్ముకోకుండా ముడుపులిస్తేనే జాబ్ వస్తుందనే భ్రమలో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఏదేమైనా పోస్టుల భర్తీలో ఉన్నతాధికారులు స్పందించి నాయకులు, మధ్యదళారుల పైరవీలు లేకుండా నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని పలువురు నిరుద్యోగులు కోరుతున్నారు.