కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చివేతలు తప్ప కొత్తవి కట్టరేమో. ఇటీవల హనుమకొండలో సీఎం సభ కోసం ఆటలు ఆడుకునే మైదానాన్ని ఎంచుకోవడమే గాక.. అడ్డుగా ఉన్నదని ఒకటి కాదు నాలుగు చోట్ల ప్రహరీని కూల్చేశారు. అంతేగాక ఇష్టమొచ్చినట్లు రంధ్రాలు చేయడంతో గ్రౌండ్‌ను ఆగమాగం చేసి గాలికొదిలేశారు. అయితే అప్పుడు కూలగొట్టేందుకు అత్యుత్సాహం చూపిన అధికారులు.. పది రోజులైనా మరమ్మతులు చేయడం లేదు. దీంతో రాత్రివేళ ఆకతాయిలు నేరుగా గ్రౌండ్లోకి వాహనాల్లో వస్తూ మందుపార్టీలు చేసుకుంటుండడంతో కాలేజీ గ్రౌండ్ కాస్త అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నది.
– వరంగల్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ నెల 19న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ‘ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ’ను నిర్వహించారు. ప్రభుత్వపరంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఏర్పా ట్లు చేశారు. మహిళా శక్తి సభకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మహిళలు, సాధారణ జనం వచ్చేందుకు వేర్వేరు ద్వారాలను ఏర్పాటు చేశారు. దీని కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు ఉన్న ప్రహరీని నాలుగు చో ట్ల కూల్చివేశారు.
ప్రభుత్వపరంగా నిర్వహించిన కార్యక్రమం కోసం ప్రహరీని కూల్చడంలో అత్యుత్సాహం చూపిన జిల్లా ఉన్నతాధికారులు ఆ తర్వాత మరమ్మతు పనులను పట్టించుకోవడం లేదు. గతంలోనూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రు లు వచ్చిన సందర్భాల్లో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ ప్రహరీని ఒకటిరెండు చోట్ల కొద్దిగా తొలగించి వెంటనే మరమ్మతులు చే సేవారు. ఈసారి అధికారులు పట్టించుకోకపోవడంతో కాలేజీ గ్రౌండ్లోకి రాత్రిపూట సైతం ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగుతున్నాయి. లోపలి వర కు వాహనాల్లో వచ్చి కొందరు ఇక్కడే మందు తాగి విందు చేసుకుంటున్నారు. ప్రహరీకి నాలుగు చోట్ల మరమ్మతులు కావడంతో ఎక్కువ ఖర్చవుతుందని, ఆమేరకు తమ వద్ద నిధులు లేవని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ అధికారులు చెబుతున్నారు.
క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సాధికారతకు పాటుపడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. ఆచరణలో మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరించింది. వరంగల్ నగరంలో వేల మంది వ్యాయామానికి, అన్ని రకాల ఆటలకు వేదికగా ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌ను మీటింగ్ కోసం విధ్వంసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ నగరంలో కొత్తగా ఒక్క గ్రౌండ్‌ను అభివృద్ధి చేయకపోగా ఉన్న పెద్ద గ్రౌండ్‌ను ఆగం చేసింది. స్టేజీ, టెంట్లు, బారికేడ్లు, లైటింగ్, సౌండ్స్ ఏర్పాటు చేసేందుకు గ్రౌండ్ అంతటా పెద్ద పోళ్లు నాటారు. గ్రౌండ్లో ఇష్టం వచ్చినట్లుగా రంధ్రాలు చేశారు. దీంతో ఆటలు ఆడుకోలేని పరిస్థితి వచ్చింది. బహిరంగ సభ తర్వాత కనీస స్థాయిలోనూ మరమ్మతులు చేయడం లేదు.
వరంగల్ నగరంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఉదయం, సాయంత్రం వేలాది మంది వాకింగ్, ఆటల కోసం వస్తుంటారు. డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ, జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ఎక్కువగా ఈ గ్రౌండ్లో నిర్వహిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.40 లక్షలతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌ను అభివృద్ధి చేశారు. వాకర్స్ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను, సోలార్ లైట్లను ఏర్పాటు చేసింది. మహిళలకు ఇబ్బంది లేకుండా మొబైల్ టాయిలెట్ సదుపాయం కల్పించింది. తెల్లవారుజామున, సాయంత్రం ఆలస్యంగా వాకింగ్‌కు వచ్చే వారికి రక్షణ పరంగా ఇబ్బందులు లేకుండా చేసింది. గ్రౌండ్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ సభ కోసం ధ్వంసం చేసింది. మరమ్మతు పనులు చేయడం మరచిపోయింది.