కాజీపేట, ఏప్రిల్ 22: కాజీపేట రైల్వే జంక్షన్ క్రూ డిపో కేంద్రంగా పనిచేస్తున్న నాలుగు లింకులను విజయవాడకు తరలించేందుకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే యూనియన్ నాయకులు తెలిపారు. గతంలో కృష్ణ, కోణార్క్, ఎల్టిటి, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ల లింకులు కాజీపేట రైల్వే క్రూ కేంద్రంగా పని చేశాయి. కాజీపేటకు చెందిన క్రూ విజయవాడ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుండి విజయవాడ మధ్య విధులను నిర్వహించేవి. కాగా, రైల్వే అధికారులు ఈ నాలుగు లింకులను విజయవాడకు తరలించడంతో పాటగా మంగళవారం నుంచి విజయవాడ రైల్వే డివిజన్‌కు చెందిన క్రూ లోకో పైలెట్లు విధులు నిర్వహించే చర్యలు, చార్ట్ ప్రిపేర్ చేసినట్టు లోకో పైలట్లు తెలిపారు.
ఇటీవల కాజీపేట క్రూ డిపోకు చెందిన 185 మంది లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, లోకో ఇన్స్పెక్టర్ల ఉద్యోగ ఖాళీలను ఇతర డిపోలకు తరలించారు. ఇప్పుడు క్రూ లింకుల తరలింపుల పై లోకో పైలట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర అధికారులు కాజీపేట రైల్వే జంక్షన్ ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్ని కొన్ని లింకులను విజయవాడకు తరలిస్తున్నారనే విషయం బయటకు రావడంతో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు, చేయడంతో రైల్వే అధికారులు దిగివచ్చి తరలింపును విరమింప చేసుకున్నారు. ప్రస్తుతం కాజీపేట రైల్వే క్రూ లింకుల తరలింపు తెర పైకి రావడంతో లోకో పైలట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.