ములుగు రూరల్, నవంబర్ 26 : పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ దీక్షా దివస్‌ను నిర్వహించాలని ములుగు జిల్లా ఇన్చార్జి, హనుమకొండ మాజీ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్టాడుతూ ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో చేపట్టిన ఆమరణ దీక్షతో కేసీఆర్ దేశ రాజకీయాలను కదిలించారన్నారు.
తెలంగాణ సాధించిన అనంతరం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమం పరంగా రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన మహోన్నత నేత కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలుచేయలేదన్నారు. దీక్షాదివస్‌లో భాగంగా ములుగు ప్రభుత్వ దవాఖాన, డీఎల్ఆర్, పార్టీ కార్యాలయం వద్ద మూడు ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు పార్టీ కార్యాలయం వద్ద ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
సమావేశంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పాలెపు శ్రీనివాస్, గడదాసు సునిల్‌కుమార్, కుడుముల లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు చెన్న వినయ్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు రాజహుస్సేన్, తాడ్వాయి మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు పోరిక విజయ్‌రామ్‌నాయక్, యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేశ్, బీసీ సెల్ అధ్యక్షుడు సురేందర్, మాజీ ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య, మాచర్ల ప్రభాకర్, జన్నారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.