ఎల్కతుర్తి, మార్చి 25 : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారెడీని తలపిస్తున్నదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా లేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. హామీల అమలుకు బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదన్నారు. రైతుభరోసాపై స్పష్టతలేదని పేర్కొన్నారు.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడూ లేనంతగా అప్పులు చేశారని, ఇది రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందన్నారు. పెన్షనర్లు, సింగరేణి కార్మికులు, మహిళలు, సంక్షేమ రంగాలకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. రాష్ట్ర పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలితో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, రైతులకు యూరియా లభించని దుస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నదన్నారు. బడ్జెట్లో బడుగు, బలహీన వర్గాలను, విద్యారంగాన్ని విస్మరించారని సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సర్కారు నెరవేర్చాలని, లేకుంటే హామీల అమలు కోసం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.