రఘునాథపల్లి, మే 31: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని అశ్వరావుపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్లోని ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు యాభై శాతం కూడా కొనలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కేంద్రాల్లో ఉన్నదనే బాధతో రైతు ఉన్నాడని, దీనికి తోడు రోహిణీకార్తె వచ్చి నారులు పోసుకునే సమయం ఆసన్నమవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సెంటర్లలోని ధాన్యాన్ని రెండు, మూడు రోజుల్లో కొనాలని ఆయన డిమాండ్ చేశారు.
మొత్తం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా నేటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారని, మే 31 వరకు ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ఇచ్చిన మాటను సర్కార్ నిలుపుకోవాలన్నారు. లేకపోతే జూన్ ఒకటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ ఎర్రోళ్ల కుమార్‌గౌడ్, మారెట్ మాజీ వైస్ చైర్మన్ ముసిపట్ల విజయ్, మాజీ సర్పంచ్, మండల అధ్యక్షుడు పెండ్లి మల్లారెడ్డి, జిల్లా నాయకులు గూడ కిరణ్, కొర్ర రాజేందర్‌నాయక్, వెల్ది ఉపసర్పంచ్ ఎడ్ల బాలరాజు, నాయకులు గోనె మల్లారెడ్డి, పెండ్లి భూపాల్‌రెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్, కృష్ణ, భూక్యా రాజు ఉన్నారు.