స్టేషన్ ఘన్పూర్: స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, ఆయన కూతురు, ఎంపీ కడియం కావ్యకు, సీఎం రేవంత్ రెడ్డికి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గురువారం పిండాలు పెట్టారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి రాజయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా 33 నెలలుగా కొనసాగుతున్న కడియం శ్రీహరి ఉప్పుగల్లు గ్రామంలోని ఒక్క ఎకరాకు సాగునీరు అందివ్వలేదని, ఎంపీ కావ్య ఉప్పుగల్లుకు ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని నిరసిస్తూ రిజర్వాయర్ వద్ద నాగూర్ల వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రాజయ్య పిండాలు పెట్టారు.
కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఉప్పుగల్లు గ్రామంలో రైతు రణభేరి, వంటా వార్పుతో పాటు వినూత్న నిరసన చేపట్టారు. అంతకుముందు జాఫర్గడ్ మండలంలోని ఉప్పుగల్లు రిజర్వాయర్ ప్రధాన కాలువను రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రాజయ్య మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రాజయ్య విమర్శించారు.
కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికై 33 నెలలు గడుస్తున్నా నియోజకవర్గంలోని ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని ఆరోపించారు. ఉప్పుగల్లు అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని ఎంపీ కడియం కావ్యపై విమర్శలు గుప్పించారు. దేవాదుల పనులను పూర్తి చేస్తామని పదేపదే హామీలు ఇచ్చినప్పటికీ అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దేవాదుల పనులను ఏడాదిలో పూర్తి చేస్తామని ఒకసారి, ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని రాజయ్య గుర్తుచేశారు.
ఆ తర్వాత ఆరుగురు మంత్రులతో కలిసి వచ్చి మళ్లీ జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలు, అభివృద్ధి పనులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. నియోజకవర్గంలో సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించి దేవాదుల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగూర్ల వెంకన్న, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, మండల మాజి కన్వీనర్ రాజ్‌కుమార్, నాయకులు కడారి శంకర్, శ్రీకాంత్,ఎండీ నజీర్, కోత్వాల కుమార్, నాయిని నరేష్ గౌడ్, పులి ధనుంజయ్, శీలం శ్యామ్,కృష్ణసాయి, గోలి కవిత, మారపల్లి కరుణాకర్, సోమిరెడ్డి, వరుణ్, కృష్ణ, శ్రీధర్, భాగ్యలక్ష్మి,పావని, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.