హనుమకొండ, జనవరి 5: రైతు భరోసా రూ.12 వేలు ఇస్తామని క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయించ డం రైతులను మరోసారి మోసం చేయడమేనని, దీనిని బీఆర్ఎస్ ఖండిస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డితో కలిసి విలేకరులతో మా ట్లాడారు. ఓరుగల్లు వేదికగా 2022 మే 6న ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాహుల్‌గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్ష హోదాలో రేవంత్‌రెడ్డి రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు రైతు డిక్లరేషన్‌ను సైతం ప్రకటించాడన్నారు.
కానీ రూ.12 వేలు ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం రైతులను విస్మయానికి గురిచేసిందన్నారు. వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనని, సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి మోసగాడని, ఆయనకు సిగ్గు, నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని పెద్ది డిమాండ్ చేశారు. నాడు రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను పెద్ది విలేకరులకు వినిపించారు. బోనస్ బోగస్ అయ్యిందని, కేవలం సన్నాలకే బోనస్ ఇచ్చి 30 శాతానికే చెల్లించారని అన్నారు. రుణమాఫీ కేవలం 30 శాతం అయ్యిందన్నారు. వరంగల్ జిల్లా నెకొండ మండలంలో 625 మంది రైతులకు మాఫీ కాలేదని పేర్కొన్నారు.
రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన ఓరుగల్లు నుంచే రైతుల పక్షాన పోరాటం ప్రారంభిస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి విశ్వాస మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటి వరకు రైతు భరోసాపై మాట్లాడడం లేదని సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. యూరియా, డీఏపీ కొరత ఉందన్నారు. రైతులను మోసం చేసినందుకు రేవంత్‌రెడ్డిపై కొత్తచట్టం బీఎన్ఎస్ 318 ప్రకారం కేసు నమోదు చేయాలని, ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రైతుల తిరుగుబాటు ఓరుగల్లు నుంచే మొదలవుతుందన్నారు. రైతులను మో సం చేసిన కాంగ్రెస్ నాయకులు పల్లెల్లో తిరిగేందుకు జంకుతున్నారని అన్నారు.
రైతు భరోసాను వాయిదా వేస్తూ వ చ్చిన కాంగ్రెస్ సరారు ఎకరానికి రైతులకు రూ.17,500 బాకీ పడిందని, ఇప్పుడు రూ.6 వేలు ఇస్తే ఇంకా రూ.11, 500 బాకీ ఉంటుందని, దీనిని రేవంత్‌రెడ్డి కడతాడా? అని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులు ఉపాధి, వ్యవసాయ కూలీలుగా పని చేస్తారని, వీరికి ఇచ్చే రూ. 12 వేలు ఏమైందన్నారు. 54 లక్షల మంది జాబ్ కార్డులు కలిగి ఉన్నారని, వీరందరికీ రూ. 12 వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదన్నారు. రైతు భరోసాను కుదించేందు కు కాంగ్రెస్ సర్కారు చూస్తున్నదని ఆరోపించారు. వరంగల్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టికి ఏమాత్రం నైతిక విలువలున్నా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా విషయంలో క్యాబినెట్ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మ న్ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఆరోపించారు. ప్రజలు, రైతులను మోసం చేసిన సీఎంపై చీటిం గ్ కేసు నమోదు చేయాలన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు లాంటి కార్యక్రమాలు చేపట్టిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. రైతులకు బాకీపడ్డ నిధులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాం త్, నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, నయీముద్దీన్, బండి రజినీకుమార్, రవీందర్రావు, జానకిరాములు, చాగంటి రమేశ్, రఘు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.