పరకాల, అక్టోబర్ 14 : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులను మందలించాల్సింది పోయి మంత్రి కొండా సురేఖ ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే బాస్ అని, ఆయనకు సముచిత స్థా నం కల్పించాల్సిందేనన్నారు. సోమవారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గీసుకొండ వర్గ పోరుపై విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల నాయకులు, పార్టీ శ్రేణులు కష్టపడి పని చేస్తేనే ఎ మ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి గెలిచారని, ఆయనను మం త్రులతో సహా ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందేనన్నారు. గీసుకొండ మండలం ధర్మారంలో చోటు చేసుకున్న ఘటనలో మంత్రి వాస్తవాలను తెలుసుకుని స్పందిస్తే బాగుండేదని, కానీ తప్పు చేసిన వారికి అండగా నిలవడం బాధకరమన్నారు.
అదే తూర్పు నియోజకవర్గంలో మంత్రి ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కొండా దంపతులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు నాయకులు అండగా నిలవాలని, అనిల్‌పై దాడి చేయడం సరైందికాదన్నారు. ఏది ఏమైనా మంత్రిగా ఉన్న కొండా సురేఖ వర్గ పోరును ప్రో త్సహించడం మంచిది కాదని, ఈ విషయాన్ని ఖండిస్తున్నట్లు భిక్షపతి పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు సోదా రామకృష్ణ, కొయ్యడ శ్రీనివాస్, కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, మడికొండ సంపత్, మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.