న్యూశాయంపేట, సెప్టెంబర్ 18 : ఘర్షణలో గాయపడిన వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదని, చట్టం అధికార పార్టీకి చుట్టమా అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. శాయంపేట మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో సోమవారం రాత్రి గణేశ్ శోభాయాత్రలో జరిగిన ఘర్షణలో గాయపడిన వారిపై, దాడి చేసి వారిపై కేసు నమోదు చేసి ఆపై కాంప్రమైజ్ అవండి అంటూ ఉచిత సలహా ఇవ్వడం గర్హనీయమన్నారు.
పోలీసుల తీరుతో ప్రజలకు చట్టాలు, పోలీసులపై నమ్మకం లేకుండా చేస్తున్నాయన్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేయడం దౌర్భాగ్యమని, ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎంపీపీపై తప్పుడు కేసులు పెట్టారని, దీనిపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. కిందిస్థాయి అధికారులు తప్పు చేస్తే పైస్థాయి అధికారులు సరిచేయాల్సింది పోయి అందరూ ఒకేలా పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఘటనపై ప్రత్యేక అధికారిని నియమించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి తప్పు చేసిన వారిని, తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ సీపీ, డీజీపీని కోరుతున్నామన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, పోతు రమణారెడ్డి, కర్ర ఆదిరెడ్డి, అరికెల ప్రసాద్, మాదారం మల్లయ్య, దూలం నాగరాజు, మాదాసి సతీశ్, మునుకుంట్ల రవి, కొసరి రాజు, వినుకొండ సురేందర్ చారి, మోరె మహేందర్ పాల్గొన్నారు.