హనుమకొండ, నవంబర్ 15: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం లేదు.. కొత్త స్కీములు లేవు.. అన్నీ స్కాములే.. సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరించడమే గాక అక్రమంగా కేసులు.. అరెస్ట్‌లు చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు 11నెలల పాలనలో హామీలను విస్మరించిందని, అభివృద్ధి లేకపోగా తెలంగాణ ఆగమైందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని చెప్పిన రైతులపై అక్రమంగా సర్కారు కేసులు బనాయించి జైలుకు పంపిందన్నారు.
కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలనగా మారిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని ఇండ్లు కూల్చివేస్తూ.. రైతురాజ్యం అంటూ రైతులను అరెస్టు చేస్తూ, ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ మరోసారి ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారని వివరించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు, మూసి ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల సంపద లూటీకి ప్రణాళికలు.. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం లగచర్ల రైతుల భూమిని కబ్జా చేయాలని చూస్తుంటే కడుపుమండిన వారు తిరగబడ్డారని అన్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోల్లు లేవు… పత్తి రైతు పంట కొనుగోలు జరగదు.. రైతుబంధుకు రాంరాం.. రుణమాఫీ సగం సగం.. ధాన్యానికి బోనస్ బోగస్‌గా మారిందన్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలు సేకరించారని, ఇప్పటికే 350 కంపెనీలు ఫార్మా పరిశ్రమలు స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి, ప్రజలను ఒప్పించి సమకూర్చి పెట్టారన్నారు. దానిని పకన పెట్టడం వెనక రేవంత్‌రెడ్డి అంతర్యమేమిటని వినయ్‌భాస్కర్ ప్రశ్నించారు. లగచర్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనలో మొత్తం 55మందిని అదుపులోకి తీసుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలను వదిలేశారని, బీఆర్ఎస్ కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని దాస్యం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, నాయకులు నయీమొద్దీన్, బండి రజినికుమార్, ప్రణయ్, రఘు పాల్గొన్నారు.