ఎల్కతుర్తి, ఏప్రిల్ 22 : తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ దేశం అబ్బురపడేలా కేసీఆర్ పాలన సాగిందని, పదేళ్లలో ప్రజలు సంతోషంగా, సుభిక్షంగా ఉన్నారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభ ప్రాంగణాన్ని మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ఆయన పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.
సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని, కుంభమేళాను తలపించేలా సభ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు ఉన్న ప్రత్యేకత వేరని, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. 1969లో తెలంగాణ మూమెంట్ జరిగి, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో 400మంది అమరులయ్యారని గుర్తుచేశారు. 1972 పార్లమెంట్ ఎన్నికల్లో 11 స్థానాలు గెలిచినప్పటికీ జాతీయ పార్టీల ముందు లొంగిపోయారని విమర్శించారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లారా చూసిన తర్వాత తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుందని డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001లో కేసీఆర్ గులాబీ జెండా పట్టుకున్నారని చెప్పారు. మలిదశ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించి అనేక ఉద్యమాలు, మార్చ్ఫాస్ట్లు, సకలజనుల సమ్మె ఇలా అనేక రీతుల్లో ఉద్యమాన్ని నడిపారని వివరించారు.
తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తుండగా అరెస్టు చేసి ఖమ్మం జైలుకు పంపారన్నారు. తర్వాత ని మ్స్‌లో కూడా ఆమరణ దీక్ష చేస్తుండగా దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసిందన్నారు. కానీ తెలంగాణ తాము ఇచ్చామని చెప్పుకుంటున్నారని, రాష్ర్టాన్ని ఎవరూ ఇవ్వలేదని, తెలంగాణ సమాజాన్ని మేలుకొలిపి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దశదిశలా ఉద్యమాన్ని వ్యాప్తిచేసి స్వయంపాలన కావాలనే లక్ష్యంతో కేసీఆరే తెలంగాణ సాధించారని పేర్కొన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా, సుభిక్షంగా ఉన్నారని, దేశం అబ్బురపడేలా పాలన చేశారని కొనియాడారు. సమావేశంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, వాసుదేవారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, పార్టీ మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, నాయకులు తంగెడ మహేందర్, ఎల్తూరి స్వామి, తంగెడ నగేశ్, గొల్లె మహేందర్, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, వేముల శ్రీనివాస్, గుండేటి సతీశ్, జడ్సన్, రాజేశ్వర్‌రావు, కోరె రాజుకుమార్, చిట్టిగౌడ్ పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ మోసం
ఆరు గ్యారెంటీలు, 420 మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల్ని నిలువునా ముంచింది. అందుకే ప్రజలు ఛీకొడుతున్నారు. కేసీఆర్ రజతోత్సవ సభ పెడుతున్నారంటే ప్రజలంతా సభకు రావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నో ఏండ్లు పోరాడినా రాని తెలంగాణను కేసీఆర్ అకుంఠిత దీక్షతో పోరాడి స్వరాష్ర్టాన్ని సాధించారు. సాధించిన తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు జనరంజక పాలన అందించారు. దేశమే తెలంగాణ వైపు చూసేలా చేశారు. రాష్ట్రంలో మళ్లీ కరంటు కోతలు మొదలయ్యాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
– ముఠా గోపాల్, ముషీరాబాద్ ఎమ్మెల్యే