మహబూబాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల అని, ప్రజలకు ఒరిగిందేమీ లేద ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవితతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. ప్రతి బడ్జెట్లో వారిని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తున్నదన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి నెట్టి వేయబడిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకోవడం తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పదేళ్లు వెనకి పోయిందన్నారు. ఈ ప్రాంత కాంగ్రెస్ ప్ర జాప్రతినిధులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సీఎం రేవంత్‌తో కొట్లాడి నిధులు తేవాలని హితవు పలికారు. గత ఏడాది బడ్జెట్లో గిరిజనుల సంక్షేమం కోసం రూ. 10,600 కోట్లు కేటాయించి కేవలం రూ. 3,700 కోట్లే ఖర్చుచేశారన్నారు.
మహబూబాబాద్ జిల్లాను గత పదేళ్లలో కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, ప్రస్తుత రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వస్తే ఆరు గ్యా రెంటీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఏ పథకం కూడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీ మాత్రమేనని, త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ బడ్జెట్ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలు పేల్చివేతలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు బడ్జెట్లో ద్రోహం చేశారని కవిత మండిపడ్డారు. సమావేశంలో పరకాల శ్రీనివాస్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ముత్యం వెంకన్న, తేళ్ల శీను, రంజిత్, రఘు తదితరులు పాల్గొన్నారు.