నర్సింహులపేట, ఆగస్టు 20: ‘సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా వైరా సభలో ఆగస్టు 15న రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతూ మాజీ మంత్రి హరీశ్‌రావును ముక్కు నేలకు రాయాలన్నారు. అసలు రుణమాఫీ పూర్తి కాలేదని మీ మంత్రులే కదా చెబుతున్నారు.
అప్పుడు ముఖ్యమంత్రే ముక్కునేలకు రాయాలి’ అని మాజీ మంత్రి ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల మందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం సరికాదన్నారు. మొత్తం రుణ మాఫీ రూ. 39 వేల కోట్లన్నరు.. ఆ తర్వాత 31 వేల కోట్లన్నరు? తీరా బడ్జెట్లో రూ. 26 వేల కోట్లు పెట్టారు. అసలు ఇప్పుడు మూడు విడుతలుగా రుణమాఫీ చేసింది రూ. 17 వేల 933 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకుని సీట్లో కూర్చొని ఈ రోజు రైతులతో చెలగాటం ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మరని అన్నారు.
మీకు చిత్తశుద్ధి ఉంటే 2018 డిసెంబర్ నుంచి 9 డిసెంబర్ 2023 వరకు ఎంత ఉంటే అంత మాఫీ చేయాలన్నారు. రుణమాఫీ పేరుతో రైతుబంధు నిలిపివేశారనిచ దీనిని రైతులు గమనిస్తున్నారన్నారు. 6 గ్యారెంటీల్లో మహిళలకు రూ. 2500, కల్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఎవరికిచ్చారో చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.