జనగామ, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పూర్తిస్థాయి రుణ మాఫీ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని, పెద్ద ఎత్తున ఉద్యమించి సర్కారు మెడలు వంచుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. రుణమాఫీ కాని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం జనగామ కలెక్టరేట్‌కు వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చే యాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు.
పెండింగ్ పనులు వెంటనే చేపట్టాలని ప్రజావాణికి హాజరైన వివిధ ప్రభుత్వ శాఖల ఇంజినీరింగ్ అధికారులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీ పథకం సంపూర్ణమంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏ ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ అయ్యిందా..? దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో ఇప్పటి వరకు 40 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు.
మిగిలిన 60 శాతం మంది రైతులు అయోమయం, ఆందోళనలో ఉన్నారని.. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో రుణమాఫీ కాని రైతు ఆత్మహత్య చేసుకున్నాడని దయాకర్‌రావు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రైతులనే కాదు, దేవుళ్లను కూడా మోసం చేసి దైవ ద్రోహానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నరు.. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు.. అన్నీ రాసిపెడుతున్నాం.. నాలుగేళ్లకు మళ్లీ మేం వస్తాం.. చట్ట ప్రకారం వ్యవహరించాలని అధికారులు, పోలీసులను ఎర్రబెల్లి హెచ్చరించారు. కేసీఆర్ సర్కారు హయాంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 50 పడకలకు పెంచే పనులకు శంకుస్థాపన చేశామని, నేటి వరకు ప్రారంభించలేదన్నారు.
సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి, వల్మిడి సీతారామస్వామి దేవస్థానం, బమ్మెర పోతన ప్రాంగణాలను టూరిజం సర్యూట్‌గా ఏర్పాటు చేస్తూ భక్తులు, ప్రజలకు వసతి కల్పించేందుకు టూరిజం హోటల్‌కు రూ.25 కోట్లు మం జూరు చేసి శంకుస్థాపన చేసినా నేటి వరకు పనులు మొదలు పెట్టలేదన్నారు. బమ్మెరలోని పోతన ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడానికి రూ. 14 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టినా ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. కొడకండ్లలో పద్మశాలీల జీవనోపాధి కోసం రూ. 61 కోట్లతో మినీ టెక్స్టైల్ పార్ మంజూరు చేసి శంకుస్థాపన చేశామని, ఇప్పటికీ పనులు ప్రారంభించలేదన్నారు.
అంతేకాకుండా పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు కూలిపోయిన ఇండ్ల బాధితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఆయా మండలాల్లో గత ప్రభుత్వ హయాంలో ఎస్డీఎఫ్, సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ కింద మంజూరైన పనులను వెంటనే చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిషరించాలని కలెక్టర్‌కు అందజేసిన వినతి పత్రంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు.