మహబూబాబాద్ రూరల్, నవంబర్ 24 : రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నియంత పాలన కొనసాగిస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో గిరిజనుల కోసం ఎంతో చేసిందన్నారు.
తండాలను గ్రామపంచాయతీలుగా చేసి ఎంతో మందిని సర్పంచ్‌లు చేయడంతో పాటు వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గిరిజన భూములను లాక్కుంటూ వారిపై దాడులు చేయిస్తున్నాడని, ఇంత నీచమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. మానుకోటలో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారని, లగచర్ల రైతులకు మద్దతుగా శాంతియుతంగా రైతుల పక్షాన ధర్నా నిర్వహించుకుంటామంటే అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. కోర్టు రైతుల పక్షాన ఆలోచించి ధర్నాకు అనుమతి ఇచ్చిందన్నారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారని, సోమవారం నిర్వహించనున్న రైతుల ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని, రైతులు తరలివచ్చి శాంతియుతంగా ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, భరత్‌కుమార్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, ఎడ్ల వేణు, జేరిపోతుల వెంకన్న, మంగళంపల్లి కన్న, తేళ్ల శ్రీను, లునావత్ అశోక్‌నాయక్, షేక్ ఖాదర్ బాబా, మార్నేని రఘు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మానుకోట గడ్డపై కేటీఆర్ ఆధ్వర్యంలో లగచర్ల రైతులకు మద్దతుగా గిరిజన రైతుల మహాధర్నాకు పిలుపునివ్వడంతో సీఎం రేవంత్ రెడ్డిలో వణుకు పుడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు గూండాయిజం చేస్తూ అమాయకులపై దాడులు చేస్తున్నారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే విధానాలు మానుకోవాలి. గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు లగచర్ల రైతులకు మద్దతుగా ఉండి వారి పక్షాన పోరాటం చేయాలి. మహాధర్నాకు అన్ని సంఘాల నాయకులు కలిసి రావాలి. లగచర్ల రైతులు చాలా అమాయకులు. వారి భూముల కోసం ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి శాంతియుతంగా పోరాటం చేయాలి.
– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నది. ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ గిరిజన రైతుల ధర్నాను అడ్డుకుంటాం, రాళ్లతో కొడతామని ద్రోహుల్లా మాట్లాడుతున్నారు. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై అలాంటి సంఘ విద్రోహ శక్తులను తరిమికొట్టాలి. గిరిజన రైతుల పక్షాన శాంతియుతంగా ధర్నా చేసుకుంటామంటే ఈ నెల 21న కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టడంతో ఎస్పీ అనుమతి నిరాకరించారు. హైకోర్టు అనుమతివ్వడంతో నేడు పట్టణంలోని ఎమ్మార్వో సెంటర్లో మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేటీఆర్ హాజరవుతున్నారు. విజయవంతం చేయాలి.
-ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు
లగచర్ల గిరిజన రైతులపై జరిగిన దాడితో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి. ఓ మాజీ సర్పంచ్‌పై విపరీతమైన ఒత్తిడి చేయడం వల్ల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన దుర్మార్గం. జిల్లాలోని ప్రజా, గిరిజన సంఘాలు లగచర్ల రైతులకు మద్దతు తెలపాలి. ప్రతి ఒక్కరూ కలిసిరావాలి. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చేసి దుమ్ములో కొట్టుకుపోయాడు.
– మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత
మహాధర్నాకు గిరిజన సంఘాల నాయకులు కలిసి రావాలి. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే లగచర్ల భూముల కోసం గిరిజన రైతులపై దాడులు చేయించి వారిని జైల్లో పెట్టించాడు. ఆయన గిరిజనులపై దారుణంగా వ్యవహరించి ఒత్తిడి చేస్తున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం అనేక పథకాలు తీసుకువస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గిరిజన రైతుల భూములను గుంజుకోవాలని చూస్తున్నది.
– మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
హామీలను విస్మరించిన రేవంత్
పేదలకు అనేక హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తులం బంగారం, మహిళలకు భద్రత, రైతు భరోసా వంటి హామీలను పూర్తిగా విస్మరించాడు. ఆయన రాగానే ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో బీఆర్ఎస్ పార్టీపై ఇష్టం వచ్చిన విధంగా మాట్లాతున్నాడు. ప్రజలు ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు.
-మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్