పెద్దవంగర/దేవరుప్పుల, జూలై24: రుణమాఫీపై కాంగ్రెస్ చెప్పిందెంత.. రేవంత్ రెడ్డి సరారు చేసిందెంత అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వానకాలానికి ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా కింద ఇవ్వాల్సిన రూ.11,250 కోట్లు ఎగ్గొట్టి అందులోంచి రుణమాఫీ కింద రూ. 6098 కోట్లు విదిల్చి ఏదో ఘనకార్యం చేసినట్టు ప్రచారం చేసుకుంటుందని దుయ్యబట్టారు. బుధవారం పెద్దవంగర, దేవరుప్పుల మండలాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డిసెంబర్ 9న చేయాల్సిన రూ.2లక్షల రుణమాఫీని ఏడు నెలలు ఆలస్యం చేసి రైతులకు రూ.31 వేల కోట్లు రుణమాఫీ అని గొప్పలు చెప్పుకొని తీరా రూ. 6వేల కోట్లు మాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఆ పార్టీ పరిస్థితి ఉందని విమర్శించారు. కేసీఆర్ ఏమి చేయలేదని అంతా తామే చేస్తున్నామనే భ్రమల నుంచి కాంగ్రెస్ సరారు బయటకు రావాలని సూచించారు. రైతు సంక్షేమం కోసం ప్రపంచంలోనే ఏ రాజకీయ నేత చేయని కార్యక్రమాలు కేసీఆర్ చేసి చూపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇంతవరకు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌలు రైతులకు ఇస్తామన్న రూ. 15వేలు ఏమైనయ్.. రైతు కూలీలకు రూ.12 వేలు ఇంకా అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారన్నారు. బీఆర్ఎస్కు పూర్వవైభవం వస్తుందని, పార్టీ తిరిగి పుంజుకుంటుందని, సమస్యలపై పోరాడుదాం, కొట్లాడుదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, ఆలయ మాజీ చైర్మన్ రామచంద్ర య్యశర్మ, నాయకులు సుధీర్‌కుమార్, వెంకట్రామయ్య, రఘు, వెంకన్న, ఫూల్ సింగ్, బాలు, యాకన్న, రవి, షర్పుద్దీన్, భిక్షపతి ఉన్నారు.