అన్నదాతలు ఆగ్రహించారు. ఇచ్చిన హామీ ప్రకారం పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కిన నిరసన తెలిపారు. సహకార బ్యాంకులు, సొసైటీల వద్దకు వందలాదిగా చేరుకొని ధర్నాకు దిగారు. ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పలుచోట్ల రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి.. రాస్తారోకోలో పాల్గొన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని రైతులకు న్యాయం జరిగేవరకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 20
దేవరుప్పుల, ఆగస్టు 20 : రుణమాఫీ కోసం రైతులు కదం తొక్కారు. మాఫీ కాని వందలాది మంది రైతులు బీఆర్ఎస్ రైతు విభాగం పిలుపు మేరకు దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలోని ఏపీజీవీబీ వరకు భారీ ర్యాలీగా చేరుకొని బ్యాంకు వద్ద ధర్నా చేశారు. మండల నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, తీగల దయాకర్, బస్వ మల్లేశ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగగా మాజీ మంత్రి ఎర్రబెల్లి హాజరై రైతులకు తాము అండగా ఉంటామని, పూర్తి రుణమాఫీ అయే వరకు పోరాడుదామని చెప్పారు.
బ్యాంకులో రుణం తీసుకున్న ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని, కుటుంబంలో అందరికీ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు వద్ద మూడు గంటల పాటు ధర్నా కొనసాగగా సీఎం డౌన్ డౌన్.. రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తాయి. రుణమాఫీ కాని రైతులు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరిపై దుయ్యబట్టారు. రేవంత్ మాయమాటలు విని ఓటేశామని, తీరా ఏ ఒక్కటీ అమ లు కాకపోవడంతో మోసపోయామని చెప్పారు.
రూ.2లక్షల వరకే రుణమాఫీ జరుగుతుందని, మిగితా డబ్బు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని బెదిరించడంతో పుస్తెలు అమ్మి కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని మంత్రి ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు. పోరాడితేనే ప్రభుత్వం దిగొస్తుందని, రుణమాఫీ చేయాల్సిన రైతుల లిస్ట్ ప్రభుత్వం వద్ద ఉందని, చేతగానితనం వల్ల మాఫీ చేయడం లేదన్నారు. ఎన్నో వాయిదాలు పెట్టిన రేవంత్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే కొంతైనా రుణమాఫీ చేసిందన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కీలకంగా వ్యవహరించడంతోనే ప్రభుత్వం దిగొచ్చిందన్నారు.
ఇంతటితో వదిలేది లేదని, ప్రతి రైతులకు రుణమాఫీ జరిగేదాకా రైతుల వెంటే ఉంటామని స్పష్టంచేశారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌తో, జిల్లా కలెక్టర్‌తో ఎర్రబెల్లి మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి రుణమాఫీ చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్, కొత్త జలంధర్‌రెడ్డి, చింత రవి, రాంసింగ్, కొల్లూరు సోమన్న, ఇంటి మల్లారెడ్డి, కత్తుల సోమిరెడ్డి మహేశ్, రఫేల్‌రెడ్డి, ఇంటి సంజీవరెడ్డి. మేడ రాంచందర్, ఎల్లప్ప, కోతి ప్రవీణ్, గడ్డం రాజు, గోపాల్‌దాస్ మల్లేశ్, మైదం జోగేశ్, వంగ అర్జున్, కుతాటి నర్సింహరెడ్డి, గిరి, నల్ల ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేను దంతాలపల్లి మండలంలోని యూనియన్ బ్యాంక్‌లో రూ. లక్షా 60 వేలు లోన్ తీసుకున్న. అందరి పేర్లు వస్తుంటే నాకు కూడా లోన్ మాఫీ అవుతుందని సంబురపడ్డ. తీరా నీ పేరు రాలేదని చెప్పడంతో బాధగా ఉంది. నా కుటుంబంలో నేను తప్ప ఎవరూ ఏ బ్యాంకులో లోను తీసుకోలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు లోన్ మాఫీ చేయలేదా? ఆర్థం కావడం లేదు.
– ఊదరి అర్వపల్లి, రైతు, పడమటిగూడెం