పాలకుర్తి/దేవరుప్పుల/వర్ధన్నపేట/కరీమాబాద్, ఫిబ్రవరి 17 : స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ త్వరలోనే సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు. రాష్ట్రం సాధించాక గోదావరిపై ప్రాజెక్టులతో వ్యవసాయాన్ని కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే.. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి కరువును తీసుకొచ్చి రైతులను అరిగోస పెడుతున్నాడని మండిపడ్డారు. సోమవారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుప్పుల, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రాలతో పాటు నగరంలోని ఆర్టీఏ జంక్షన్ వద్ద నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేక్‌లు కట్ చేయడంతో పాటు వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటి పండ్లు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దేవరుప్పులలో కార్యకర్తలకు హెల్మెట్లు అందజేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, తాము కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని బాధపడుతున్నారని, మళ్లీ ఆయనే రావాలని కోరుకుంటున్నారని అన్నారు. నీరుండీ రైతులకు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, వాగులు, చెరువులు, కుంటలు ఎడారిని తలపిస్తున్నాయన్నారు.
యాసంగి పంటలు ఎండుతుంటే ఆనాటి నీళ్లు ఎటుపోయాయని రైతులు మొత్తుకుంటున్నారన్నారు. దేవాదుల నీరు వస్తుందని రైతులు నాట్లు పెడితే చుక్క నీరు ఇవ్వలేదని, కళ్ల ముందే పంటలు ఎండుతున్న రైతుల గోస కనిపించడం లేదా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. పార్టీలో అడుగడుగునా అసమ్మతి రాజుకోవడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఉందని, ఇందుకు ఢిల్లీలో ఆయన చేసిన చిట్‌చాటే నిదర్శనమన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు.