హనుమకొండ, మే 27 : కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల వెన్ను విరుస్తున్నదన్నారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లిలోని ఎన్వీ కన్వెన్షన్‌లో 30 పైగా సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ డిపార్ట్మెంట్లో అధికారులకు కార్మిక సంఘాలు పలుమార్లు తమ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నా పరిషారం కావడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని విమర్శించారు. పని దినాలు, వేతనాలు, కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. వీటిపై కార్మిక చైతన్య మాసోత్సవంలో భాగంగా కార్మికులను సమీకరించి చైతన్యపర్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల జీవితాలను ఆగం చేసిందన్నారు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని చెప్పిన హామీ నెరవేర్చడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు కనీస వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌కు దకుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రిటైర్డ్ ఉద్యోగులకు దకాల్సిన బెనిఫిట్స్ అందడం లేదన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులను సర్కారు మోసం చేసిందని పేర్కొన్నారు. కార్మిక పక్షాన జూన్ 1న సమావేశం నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పోరాడుతామన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది గిగ్ వరర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వడ్ల కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యంపై ఆర్టీసీ డ్రైవర్ ప్రశ్నించినందుకు ఉద్యోగంలో నుంచి తొలగించారని విమర్శించారు. రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కొందరు కక్షపూరితంగా వ్యవహరించడాన్ని వినయ్‌భాస్కర్ ఖండించారు. నాగేశ్వర్‌కు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ కన్వీనర్ నాయిని రవి, పెయింటర్స్ యూనియన్ అధ్యక్షుడు రాజారపు రాజు, సిరికొండ భిక్షపతి, ఎల్‌పీసీసీ వరర్స్ యూనియన్ కాల్వ సుదర్శన్, భాషబోయిన తిరుపతి, రామాచారి, నాయకులు ఎండీ ఇస్మాయిల్, ఈసంపల్లి సంజీవ, శ్రీధర్‌రెడ్డి, జయరాం, సుధాకర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రమ పాల్గొన్నారు.