ఏటూరునాగారం, మార్చి 22 : ఏటూరునాగారం అటవీశాఖ నార్త్ రేంజ్ పరిధిలోని తునికాకు బోనస్‌లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టిన పోలీసులు నాటి రేంజ్ అధికారి బాలరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. తునికాకు బోనస్‌లో అక్రమాల ఉదం తం కొద్ది రోజుల కిత్రం వెలుగు చూసింది. 2023 సంవత్సరంలో తునికాకు సేకరించిన కూలీలకు బోనస్ మంజూరైంది. అనేక మంది కూలీలు తమకు రావాల్సిన బోనస్‌ను అధికారులు, కల్లెదారులు, ఇతరులు వారికి అనుకూలమైన పేర్లకు మళ్లించి అన్యా యం చేశారని ఆందోళన నిర్వహించి అటవీశాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు.
దీంతో వారు విచారణ చేపట్టారు. ప్రధానంగా అటవీశాఖలోని వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ తండ్రి, ఇద్దరు బేస్ క్యాంపు సిబ్బంది, ఇద్దరు ప్లాంటేషన్ల వర్కర్లు, మరో ఇద్దరు టింబర్ డిపోలో పనిచేస్తున్న వారి బ్యాంకు ఖాతాల్లో అటవీశాఖ అధికారి తరఫున బోనస్ డబ్బులు సుమారు రూ.2.76 లక్షల వరకు జమైనట్లు విచారణలో వెలుగు చూసింది. అవకతవకల వెనుక నాటి నార్త్ రేంజ్ అధికారి ఉన్నట్లు వెలుగు చూసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానికం గా విధులు నిర్వర్తిసున్న డిప్యూటీ రేంజ్ అధికారి పది రోజుల క్రితం ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో ఆరుగురు తమకు ఎలాంటి సంబం ధం లేదని, తమ ఖాతాల్లో జమ చేసిన డబ్బులను రేంజ్ అధికారికి ముట్ట జెప్పామని చెప్పారు. దీంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. బోనస్ పంపి ణీ అవకతవకల్లో అప్పటి రేంజ్ అధికారి బాలరాజు హస్తం ఉన్నట్లు గుర్తించి శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. నాడు రేంజ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న బాలరాజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాలో జమైన బోనస్ డబ్బులు డ్రా చేసి తన సొంతానికి వాడుకున్నట్లు నిర్దారణ కావడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్ పాల్గొన్నారు.