జయశంకర్ భూపాలపల్లి, మే 21 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం గ్రామం.. చుట్టూ అభయారణ్యం.. పకనే కాళేశ్వర-ముక్తీశ్వరాలయం.. చెంతనే గోదావరి, ప్రాణహిత, సరస్వతీ (అంతర్వాహిని) సంగమం. నిత్యం రద్దీగా ఉండే ఈ గ్రామంలో అటవీశాఖ అతిథుల కోసం మంచి విడిదిని ఏర్పాటు చేసింది. 2015లో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో అన్ని హంగులతో సందర్శకులకు అనువుగా ఒక బృందావనంలా ముక్తివనాన్ని ఏర్పాటు చేసింది.
ప్రకృతి ఒడిలో ఉల్లాసంగా గడపడానికి రూ.1.58 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేసింది. అటవీ శాఖ మరో రూ.4 కోట్లతో అభివృద్ధి చేసింది. ఉడెన్ కాటేజ్, ఉడెన్ క్యాంటీన్, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక పార్, సుమారు 5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, నీటి కొలనుతో అందంగా తీర్చిదిద్దింది. కాగా, తాజాగా అటవీశాఖ మరో మూడు ఉడెన్ కాటేజీలను ఏర్పాటు చేసింది.
నేలమీద కాకుండా చెట్లపై బెడ్రూం (ఏసీ), బాత్రూం, హాల్లో విలాసవంతంగా ఏర్పాటు చేసిన ఈ ఉడెన్ కాటేజీలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. సరస్వతీ పుషరాల సందర్భంగా భక్తులు కాటేజీలను సద్వినియోగించుకుంటున్నారు. రూ.2500 ఆన్లైన్, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ముక్తివనంలో వీడియో చిత్రీకరణకు అదనంగా రూ.వెయ్యి వసూలు చేస్తున్నట్లు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ఆనంద్ తెలిపారు.