వరంగల్, మే 3 : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారు స్వాగత్ రణ్వీర్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి తూర్పు నియోజకవర్గ పరిధిలోని సీకేఎం కళాశాల, చార్బౌళి వాటర్ ట్యాంక్, శంభునిపేట హైస్కూల్, శివనగర్, కౌటిల్య, ఆర్య హైస్కూల్లోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ఆమె పలు సూచనలు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కేంద్రాల పరిధిలోని పోలీసు కేసుల వివరాలపై ఆరా తీశారు. ఎలక్టోరల్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు శాఖ సేవలు వినియోగించుకోవాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నందిరాం నాయక్, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్రావు, జలపతిరెడ్డి, ఆర్ఐ కీర్తన్ పాల్గొన్నారు.