బచ్చన్నపేట ఏప్రిల్ 22 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారంతా ఆరోగ్యంగా ఉండేలా చూసే బాధ్యత మనందరి పైన ఉందని జనగామ జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్ అన్నారు. మంగళవారం లింగంపల్లి క్లస్టర్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలోని రైతు వేదికలో పోషణ పక్ష ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలు, పౌష్టికాహారం పై ప్రదర్శన ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందు గాను ప్రతినెల గుడ్లు, బాలామృతం అందిస్తున్నామని తెలిపారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఆకుకూరలు కూరగాయలు, రాగులు తైదలు, సజ్జలు, బెల్లం పట్టీలు, నువ్వుల ముద్దులు, రాగి జావా వంటి పౌష్టికాహారం పై ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు అంకితభావంతో పని చేస్తే సమాజంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు . కార్యక్రమంలో జనగామ సిడిపిఓ రమాదేవి, సూపర్వైజర్ కవిత, ఎంపీడీవో మల్లికార్జున్, ఎంఈఓ వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, సీసీ నరసింహులు, మిషన్ శక్తి కోఆర్డినేటర్ శారద, వెబ్ ప్రతినిధి పవిత్ర పాల్గొన్నారు.