నెల్లికుదురు, సెప్టెంబర్ 18: మండలంలోని రావిరాల గ్రామంలో భారీ వర్షాలతో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన గ్రామస్తులకు కొద్ది మందికే సాయం చేయడంపై విమర్శలు వ్యక్త మవుతున్నాయి. గ్రామంలో సుమారుగా వరద బాధితులు 437మంది ఉంటే కేవలం143 మం దిని ఎంపిక చేశారు. అందులో పూర్తిగా నష్టం జరిగిన 22 మంది ఒక్కొక్కరికి రూ. 16,500, పాక్షికంగా నష్టపోయిన 121 మందికి రూ. 10 వేల చొప్పున వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
ఆ 143 మందిని స్వచ్ఛంద సంస్థ లు, పార్టీలు, ప్రజా సంఘాలు, ఫౌండేషన్లు ఆదుకున్నాయి. మిగిలిన 294 కుటుంబాలు ఎ వరి సాయం అందక, అన్నీ కోల్పోయి అరిగోస పడుతున్నారు. మమ్ముల్ని ఆలకించే వారే లేరా.. మాకు సర్కారు సాయం అందివ్వరా అని వారు ప్రశ్నిస్తున్నారు. అర్హుల జాబితను సిద్ధం చేసే క్రమంలో రాజకీయ పలుకుబడితో అనర్హులకు పెద్దపీట వేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వరద బాధితుల జాబితాలో తమ పేర్లు లేని 200 మంది గ్రామస్తులు ఆటోలో తహసీల్దార్ కార్యాలయానికి మాకూ సర్కారు నుంచి సాయం అందివ్వాలని కోరారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ. 10 వేలివ్వాలని మార్క బుచ్చ మ్మ, స్వాతి, జయమ్మ, హైమావతి, భాగ్యమ్మ, రాజమ్మ, ఉమారాణి, లక్ష్మి తదితరులు డిమాం డ్ చేశారు. అనంతరం తహసీల్దార్ లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ తరంగిణికి వినతిపత్రం అందజేశారు.
రావిరాల గ్రామంలో ప్రతి ఒక్కరు అన్నీ కోల్పోయి నిరాశ్రయిలయ్యారు. చేసుకోవడానికి కూలీ పనులు లేవు. ఇండ్లు కూలిన వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. రైతులకు ఎకరాకు రూ. 50 వేల పంటనష్టపరిహారం అందివ్వాలి. ప్రతి కుటంబానికి రూ. 10 వేలు వారి ఖాతాల్లో జమ చేయాలి. వరద బాధితుల అర్హుల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అనర్హులకు పెద్ద పీట వేశారు.
– ఆకుల జగ్గయ్య, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, రావిరాల గ్రామం