హనుమకొండ చౌరస్తా, జులై 23: టీజీపాలిసెట్-2025 డిప్లొమా కోర్సుల తుది విడత వెబ్ కౌన్సిలింగ్ ఈనెల 24 నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రైవేట్ కళాశాలలలో ప్రవేశాల కోసం ఈ తుది విడతలో పాల్గొనడానికి అభ్యర్థులు సన్నద్ధం కావాలని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఈ కౌన్సిలింగ్లో మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు కూడా తమకు బెటర్మెంట్ అవసరమైతే తిరిగి ఆప్షన్లు ఇవ్వవచ్చని, అలాగే మొదటి విడతలో సీటు పొందని అభ్యర్థులు కూడా ఈ తుది విడతలో అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. అయితే మొదటి విడతలో కౌన్సిలింగ్‌కు హాజరుకాకపోయిన అభ్యర్థులు తుది విడతకు కొత్తగా స్లాట్ బుక్ చేసుకుని ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా టీజీ పాలిసెట్ హెల్ప్‌లైన్ సెంటర్‌గా గుర్తింపు పొందిన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కేంద్రంలో ప్రక్రియకు కావలసిన ఏర్పాట్లు పూర్తయినట్లు, అభ్యర్థులు సకాలంలో అవసరమైన ధృవపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ (స్లాట్‌బుక్ చేసిన అభ్యర్థులకు) 24న, ఆప్షన్ల ఎంపిక (మొదటి విడత సీటు పొందినవారూ, పొందనివారూ) 24 నుంచి 25 వరకు, ఆప్షన్ల ఫ్రీజింగ్ (చివరి తేది) 25, తాత్కాలిక సీటు కేటాయింపు 28లోపు, ఫీజు చెల్లింపు వెబ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 28 నుంచి 29 వరకు, కాలేజీల్లో హాజరు నమోదు 28 నుంచి 30 వరకు, జాయినింగ్ వివరాల అప్డేట్ చివరి తేదీ జూలై 31, అకాడమిక్ సెషన్ ప్రారంభం 28, ఒరియంటేషన్ క్లాసులు జుల 28 నుంచి 30 వరకు, తుది విడత సీటు కేటాయింపు అనంతరం బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడం తప్పనిసరి, ఫీజు చెల్లించి వెబ్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన అభ్యర్థుల సీటు మాత్రమే స్థిరంగా పరిగణించబడుతుందన్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో తుది విడతలో సీటు పొందిన విద్యార్థులకు ఇంటర్నెట్ స్లైడింగ్ ద్వారా అదే కాలేజీలో ఇతర బ్రాంచ్‌కు మారేందుకు అవకాశం కూడా ఇంటర్నెట్ స్లయిడింగ్ ద్వారా ఉంటుందన్నారు. వెబ్ ఆప్షన్ల ఎంపిక ఆగస్టు 2 నుంచి 3 వరకు స్లయిడింగ్ సీటు కేటాయింపు ఆగస్టు 5 వరకు జరుగుతుందని, బ్రాంచ్ మారిన విద్యార్థులు వారి కొత్త బ్రాంచ్‌లో రిపోర్టింగ్ ఆగస్టు 6 వరకు స్పాట్ అడ్మిషన్స్ ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన ఖాళీలను నింపేందుకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి ప్రారంభమై 11వ తేదీ వరకు ముగుస్తుందన్నారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్‌ను https://tgpolycet.nic.in సందర్శించాలన్నారు.