ఆదివారం సెలవురోజున ఎంతో సంతోషంగా మేడారం బయల్దేరిన ఆ రెండు కుటుంబాల ప్రయాణం విషాదాంతమైంది. మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకునే లోపే మృత్యువు రూపంలో వచ్చిన టిప్పర్ వారి కారును ఢీకొనడంతో నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాశీబుగ్గకు చెందిన మామ-అల్లుడి కుటుంబసభ్యులు ఎనిమిది మంది ఉదయం కారులో దైవదర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనుముల నర్సిం హాచారి(60), అతడి కూతురు వెల్దండి ఆకాంక్ష(33), అల్లుడు వెల్దండి సాంబరాజు(42), మనుమరాలు వెల్దండి లక్ష్మీ ప్రసన్న(9) అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనుకోని ఈ ఘటన ఇరు కుటుంబాలను శోకసంద్రంలో పడేసింది.
ఆత్మకూరు/కాశీబుగ్గ, జూన్ 25 : మండలంలోని నీరుకుళ్ల, ఆత్మకూరు గ్రామ శివారులో ఆదివారం కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న ఆకర్ష్‌తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌లోని కాశీబుగ్గ ప్రాంతంలోని వీకర్ సెక్షన్ కాలనీ, లేబర్ కాలనీకి చెందిన రెండు కుటుంబాలు ఆదివారం మేడారం తల్లుల దర్శనానికి కారులో వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకొని తిరిగి వస్తుండగా, ఆత్మకూరు, నీరుకుళ్ల గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో కారు నుజ్జనుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న అనుముల నర్సింహాచారి(60), అతడి కూతురు వెల్దండి ఆకాంక్ష(33), అల్లుడు వెల్దండి సాంబరాజు(42), మనుమరాలు వెల్దండి లక్ష్మీప్రసన్న(9) అక్కడికక్కడే మృతిచెందారు.
కాగా నర్సింహాచారి భార్య అనుముల రాజశ్రీ(50), కూతురు అనుముల అక్షిత(25), మనుమడు వెల్దండి అక్షయ రాజు(6), కుమారుడు అనుముల ఆకర్ష్(29)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఐ బండారి కుమార్, ఎస్సై ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సింహాచారి, సాంబరాజు స్టీల్ సామాను షాపులో వర్కర్లుగా పని చేస్తున్నారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.