వ్యవసాయమే జీవనోపాధిగా ముందుకు సాగుతున్న ఓ రైతు వినూత్నంగా ఆలోచించి చేపల పెంపకం వైపు దృష్టి పెట్టాడు. తొలి ప్రయత్నంలో నష్టాల బాట పట్టినా మేలైన యాజమాన్య పద్ధతులను అవలంబిస్తూ లాభాలు గడిస్తున్నాడు. తన వ్యవసాయ క్షేత్రం లో చెరువులు తవ్వించి నిపుణుల సలహాలు, సూచనలతో బొమ్మె(కొర్రమీను) చేపలను సాగు చేస్తున్నాడు. అధిక ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దస్తరి శ్రవణ్ కుమార్.
– వేలేరు, అక్టోబర్ 21
హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దస్తరి శ్రవణ్ కుమార్ గత సంవత్సరం నుంచి చేపల సాగు చేస్తున్నాడు. అంతకు ముందు వరి, పత్తి, మక్కజొన్న, వేరుశనగ లాంటి పంటలను సాగు చేశాడు. ఏళ్ల తరబడి ఆయా పంటల్లో లాభాల కంటే నష్టాలే ఎక్కువ రావడంతో వినూత్నంగా అలోచించి చేపల పెంపకంపై దృష్టి సారించాడు. తన వ్యవసాయ క్షేత్రంలోనే ఎకరంన్నర పొలంలో నాలుగు చేపల చెరువులను తవ్వించి సాగు చేస్తున్నాడు.
తొలి ప్రయత్నంలోనే తీవ్ర నష్టం
ముందుగా వ్యవసాయ భూమిలో నేల స్వ భావం, నీటి గాఢతలను తెలుసుకోవడానికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. చేపల చెరువులను తవ్వడానికి రూ.15 లక్షలకు పైగా ఖర్చు అయ్యింది. హైదరాబాద్ నుంచి సుమా రు రూ.లక్ష పెట్టి చేప పిల్లలను కొనుగోలు చేయ గా అవి కొద్దిరోజుల్లోనే మృత్యు వాత పడ్డాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత కృషి విజ్ఞాన కేంద్రం నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో చేపల పెంపకంపై అవగాహన, మెళకువలు తెలుసుకున్నాడు. జాగ్రత్తలు పాటిస్తూ ఇప్పుడు ఎకరంన్నర చెరువులో సుమారు 30,000కు పైగా చేపపిల్లలను పెంచుతున్నట్లు రైతు శ్రవణ్‌కుమార్ చెబుతున్నాడు.
బొమ్మె చేపలతోఎక్కువ లాభాలు
బొమ్మ చేపకు గిరాకీ ఎక్కువ. మిగతా చేపలతో పోల్చితే వీటి సాగుతో అధిక లాభాలు పొందవచ్చు. 3 నుంచి 4అంగుళాల పొడవు ఉన్న బొమ్మె చేపపిల్లలు మార్కెట్లో ఒక్కోటి రూ.15కు లభిస్తాయి. మొదట్లో నల్లగొండ జిల్లా నుంచి చేపపిల్లలను కొనుగోలు చేశామని, తర్వాత తానే ఉత్పత్తి చేస్తున్నట్లు రైతు వివరించారు. సుమా రు 8 నుంచి 12నెలల్లో కిలో నుంచి కిలోన్నర వరకు సైజు పెరుగుతాయి. మార్కెట్లో దొరికే ఫీడ్(దాణా) వాడితే సరిపోతుంది. చేప పిల్లలకు రోజుకు 40 కిలోల వరకు దాణా అవసరమవుతుంది. దీనికి ఖర్చు ఎక్కువ. మార్కెట్లో బొమ్మె చేపలకు మంచి గిట్టుబాటు ధర ఉండడంతో ఎక్కువ లాభాలు వస్తున్నాయి.
సరైన మార్కెటింగ్ కల్పించాలి
చేపలను సరైన సమయంలో విక్రయించేందుకు ప్రభుత్వం మార్కెటింగ్ అవకాశం కల్పించాలి. వరంగల్‌లో చేపల మార్కెట్ లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే చేపల పెంపకందారులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. దీంతో మరింత మంది రైతులు చేపల పెంపకానికి ముందుకు వస్తారు.
– దస్తరి శ్రవణ్‌కుమార్
రోజుకు 2గంటల చాలు..
చేపపిల్లల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మంచి లాభాలు పొందవచ్చు. రోజుకు ఉదయం ఒక గంట, సాయంత్రం మరో గంట పాటు వాటి సంరక్షణకు కేటాయించి మిగతా పనులను కూడా చూసుకోవచ్చు. చేప పిల్లలకు ప్రతి రోజూ దాణా అందేలా చూసుకోవాలి. ఆప్పుడప్పుడు వాటి కదలికలను గమనిస్తూ ఉండాలి.
– దస్తరి రజిత