దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఆయిల్‌పామ్ తోటల సాగు సత్ఫలితాలనిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ను తెరపైకి తెచ్చిన అప్పటి సర్కారు దాన్ని సాగు చేసేలా రైతులను చైతన్యపరిచింది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 3,649.57 ఎకరాల్లో 1,229 మంది రైతులు ఈ పంటను సాగు చేయగా, ఇందులో మొదటి విడతగా 352.55 ఎకరాల్లో క్రాప్ వస్తున్నది. దీన్ని జూన్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టన్ను ఆయిల్ పామ్‌కు రూ. 19,144 ధర ఉండగా, పంట కోత ప్రారంభం కావడంతో ఇక నెల నెలా ఆదాయం సమకూరనుంది. ఈ క్రమంలో నైన్‌పాకలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగవంతం చేయగా, జిల్లాతోపాటు ఇతర జిల్లాల రైతులు సైతం ఇక్కడికే వచ్చి తమ పంటను విక్రయించుకునే అవకాశం ఉంది.
– జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ)
ఆయిల్ పామ్ సాగుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించింది. సాగుతో లాభాలు, అంతర పంటలతో అదనపు ఆదాయం గురించి వివరించి రైతులకు అవగాహన కల్పించింది. ఈక్రమంలో రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు మొగ్గు చూపారు. జయశంకర్ భూపా లపల్లి జిల్లాలో 3649.57 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగవగా, ఇందులో 352.55 ఎకరాల్లో పంట కోత దశకు వస్తున్నది.
ఈ పంటను జూన్‌లో విక్రయించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఒక సారి ప్రారంభమైన క్రాప్ ఇక ప్రతి నెలా రైతులు విక్రయించుకునే వీలుంది. ఇలా నిరవధికంగా 30 ఏళ్లపాటు నెలనెలా ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎకరాకు 5 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ పామ్‌కు రూ. 19144 ధర ఉందని అధికారులు తెలుపుతున్నారు. పంట దిగుబడి వస్తుండడంతో సువెన్ అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించింది.
జిల్లాలోని 11 మండలాల్లో 10 మండలాలకు చెందిన 112 మంది రైతులు 2021-22లో మొదటి విడతగా 352.55 ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటగా ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. భూపాలపల్లి మండలంలో 42.10 ఎకరాలు, చిట్యాలలో 75.35, ఘణపురంలో 16.60, మొగుళ్లపల్లిలో 77.43, రేగొండలో 73.05, టేకుమట్లలో 14.58, కాటారంలో 5.38, మహాముత్తారంలో 37.63 ఎకరాలు, మల్హర్‌లో 10.43 ఎకరాల్లో మొదటి విడత వేయగా పంట దిగుబడి షురూ అయింది.
అలాగే 2022-23లో 609 మంది రైతులు 1877.53 ఎకరాల్లో, 2023-24లో 411 మంది రైతులు 1163.90 ఎకరాలో, 2024-25లో 97 మంది రైతులు 255.58 ఎకరాల్లో ఆయిల్‌పాం పంటను సాగు చేశారు. మొత్తం 3649.57 ఎకరాల్లో సాగు కాగా ఇంకా ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం కనబరుస్తున్నారు. పంట మొదటి సంవత్సరం నుంచి నాలుగేళ్ల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ. 4200 సబ్సిడీ అందించింది. ఒక్కో మొక్కకు రూ.223 ఉండగా రూ.193 సబ్సిడీ ఇచ్చింది.
పంట దిగుబడి ప్రారంభం కాబోతుండడంతో సువెన్ అగ్రో ఇండస్ట్రీ స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో ప్రారంభించింది. అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా, తాగునీటి సౌకర్యార్థం 5 బోర్లు వేశారు. ఏడాదిలోగా ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు. ఫ్యాక్టరీ పూర్తయితే పెద్దపల్లి, ములు గు, వరంగల్ జిల్లాల నుంచి ఆయిల్‌పాం పంటను రైతులు ఇక్కడికే తీసుకువచ్చి విక్రయించుకునే వీలుంది.