మహబూబాబాద్ రూరల్, నవంబర్ 18 : లగచర్ల రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని.. లగచర్ల ఘటన, గిరిజన సమస్యలు, ఎన్నికల హామీలను అమలు చేయాలని గిరిజన రైతుల కోరిక మేరకు ఈ నెల 20న మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో 15వేల మంది రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. సోమవారం మహబూబాబాద్‌లోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, బానోత్ శంకర్‌నాయక్‌తో కలిపి వారు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజనులను ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసమే లగచర్లలో ఫార్మా కంపెనీ పేరుతో అమాయక పేద గిరిజనుల భూములను లాక్కొనే కుట్ర చేస్తున్నాడన్నారు. భూమిపైనే నమ్ముకొని బతుకున్న గిరిజన రైతుల ఇండ్లపైన పడి దారుణంగా హింసిస్తూ ప్రశ్నించిన రైతులపైనే కేసులు పెడుతూ దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేగాక ఏదైనా చిన్నసాకు చూపి కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ గిరిజన రైతులకు అండగా ఉంటుందన్నారు.
ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ హైదరాబాద్ పరిసరాల్లో భూములున్నా తన బంధువుల లబ్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఫార్మా కంపెనీ పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. తండాల్లో విద్యుత్, మొబైల్ సిగ్నల్స్ లేకుండా చేసి అర్ధరాత్రి గిరిజన రైతులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి లంబాడా ఓట్లు కావాల్సి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి వారిని అణచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, వాసుదేవారెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.