గీసుగొండ : యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ రైతు సహకార సంఘంలో యూరియా కోసం వచ్చిన రైతులకు లేదని చెప్పడంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. రెండు రోజులుగా వానలు పడుతుండడంతో పత్తి పంటలో యూరియా వేయడానికి రైతులు సిద్ధమయ్యారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో అత్యధిక రైతులు సభ్యులుగా ఉన్న సొసైటీలో యూరియా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున సొసైటీకి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం స్టాక్ ఇవ్వడం లేదని అధికారులు చెప్పడంతో చేసేదేమీ లేక రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.