పర్వతగిరి : కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనుగోళ్లు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహించిన రైతులు రోడ్డు పైన ధాన్యం తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగుమల్ల గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి రోజులు గడుస్తున్నా కాంటాలు నిర్వహించక పోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే అధికారుల నిర్లక్ష్యంతో వర్షార్పణం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.