ఎకరానికి ఏటా రూ.15వేలు రైతుభరోసా ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ పేరుతో రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పి ఇప్పుడు మాట మార్చి మోసం చేయడంపై ఓరుగల్లు రైతాంగం కన్నెర్రజేసింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదైనా పెట్టుబడి సాయం ఇవ్వకుండా కాలయాపన చేయడమేగాక తీరా ఇప్పుడు రూ.12వేలే ఇస్తామంటూ కోతలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఈమేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించగా అన్నదాతలు కదలివచ్చి ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ.15వేలు ఇవ్వాల్సిందేనని లేకపోతే రైతుల తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
– నమస్తే నెట్వర్క్, జనవరి 6
నెక్కొండ, జనవరి 6 : పండుగలా ఉన్న వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దండుగ చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నెక్కొండ హైస్కూల్ సెంటర్లో సోమవారం బీఆర్ఎస్ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు రూ.12 వేలే ఇస్తామని ప్రకటించి రైతులను కష్టాలపాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.12వేల చొప్పున ఇస్తామన్న హామీ కి కట్టుబడి అమలుచేయలని డిమాండ్ చేశారు.
వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వరంగల్‌కు వస్తున్న ఉప ముఖ్యమంత్రిని అడుగాలని ప్రెస్‌మీట్ పెడితే వెంటనే వందల మంది పోలీసులు బీఆర్ఎస్ కార్యాలయా న్ని ముట్టడించి తమను నిర్బంధించారని, ఇదేం ప్రజాపాలన అని పెద్ది ప్రశ్నించారు. హామీ ప్రకారం రైతుభరోసా ఇవ్వాలని లేకపోతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కే పరిమితం కావాల్సి వస్తుందన్నారు. నేటి నుంచి నిరసనలు ప్రారంభమవుతున్నాయని, నర్సంపేట నుంచే రైతుల తిరుగుబాటు ఉవ్వెత్తున లేవడం ఖాయమన్నారు.
కార్యక్రమంలో నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూర య్య, న్యాయవాది కొమ్ము రమేశ్‌యాదవ్, మాజీ ఎంపీపీ జాటోత్ రమేశ్‌నాయక్, మాజీ జడ్పీటీసీ లావుడ్య సరోజ-హరికిషన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొనిజేటి భిక్షపతి, మాజీ ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, నాయకులు తోట సాంబయ్య, కారింగుల సురేశ్, ఈదునూరి యాకయ్య, మాజీ సర్పంచ్ మహబూబ్ పాషా, మాజీ వైస్ చైర్మన్ దొనికెన సారంగపాణి, గాదె భద్రయ్య పాల్గొన్నారు.