వరంగల్, ఆగస్టు 23 (నమస్తేతెలంగాణ): అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1,907 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అర్హత ఉన్నా తమకు రుణమాఫీ వర్తించకపోవడంతో కుమిలిపోతున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) పరిధిలోని గ్రామాల రైతులు కాపులకనపర్తి పీఏసీఎస్‌లో సభ్యత్వం పొందారు.
3,200మందికి పైగా సభ్యులుండగా, 1,907 మంది రైతులకు సుమారు రూ.14.77 కోట్లకుపైగా రుణ పంపిణీ జరిగింది. వీరంతా రుణమాఫీ అమలుకు ప్రభుత్వం ప్రకటించిన 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీలోపు రుణాలు తీసుకున్న రైతులే. అయితే, రుణమాఫీకి అర్హత గల రైతుల జాబితాలను పంపాలని ఇటీవల ప్రభుత్వం అధికారులను ఆదేశించినా, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. మొదటి విడుత రూ.లక్షలోపు రుణం గల రైతులకు గత జూలై 18 నుంచి ప్రభుత్వం నిధులను విడుదల చేయడం ప్రారంభించింది.
కాపులకనపర్తి పీఏసీఎస్ అధికారులు వివిధ కారణాలతో జూలై 20 తర్వాత రుణమాఫీకి అర్హత గల 1,907 మంది రైతుల పేర్లతో జాబితాను ప్రభుత్వానికి పంపారు. సాంకేతిక లోపాల వల్ల ప్రభుత్వం ఈ జాబితాను రుణమాఫీ కోసం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అప్పటికే మొదటి విడుత రుణమాఫీ వర్తించని రైతులకు రెండో విడుత రూ.1.50 లక్షల రుణమాఫీ కూడా వర్తించలేదు. ఈ నెల 15న ప్రారంభమైన మూడో విడుత రూ.2 లక్షల రుణమాఫీలోనూ ఎవరి ఖాతాలో నిధులు జమ కాలేదు. ఇలా మూడు విడుతల్లోనూ 1,907మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు.
రాష్ట్రంలో ప్రస్తుతం రుణమాఫీ ఒక రైతుకు కూడా వర్తించని పీఏసీఎస్‌ల్లో కాపులకనపర్తి ఒకటిగా నిలిచింది. మూడు విడుతల్లోనూ ప్రభుత్వం రుణమాఫీ చేసిన సమయంలో అర్హత గల 1,907 మంది రైతుల్లో పలువురు కాపులకనపర్తిలోని పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకొని అధికారులను కలిశారు. ఆడిట్, సాంకేతిక సమస్య వల్ల రుణమాఫీ వర్తించడంలో కొంత ఆలస్యమైందని, త్వరలోనే 1,907 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ అవుతాయని అధికారులు చెప్పారు.
అయితే మూడోవిడుతలోనూ రుణమాఫీ వర్తించకపోవడంతో ఈ 1,907మంది రైతుల్లో కలవరం మొదలైంది. వీరిలో చాలామంది రైతులు అధికారులను సంప్రదించారు. ప్రధానంగా ప్యాక్స్ అధికారులను నిలదీశారు. అర్హత ఉన్నా తమకు రుణమాఫీ వర్తించకపోవడానికి మీరే కారణమని మండిపడ్డారు. ఆ తర్వాత వ్యవసాయశాఖ అధికారులను కలిసి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 20న గవిచర్ల వద్ద రాస్తారోకో నిర్వహించి తమకు రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో కాపులకనపర్తి పీఏసీఎస్ చైర్మన్, అధికారులు హైదరాబాద్‌లో వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావును కలిసి సాంకేతిక సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్హత ఉన్నందున 1,907 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. ఇదిలాఉంటే మూడు విడుతల్లో తమకు రుణమాఫీ వర్తించనందున రానున్న రోజుల్లో రుణమాఫీ తమకు వర్తించేనా? అనే ఆందోళన 1,907 మంది రైతుల్లో నెలకొన్నది. అధికారుల తీరును నిరసిస్తూ దశలవారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందించే పనిలో బాధిత రైతులు నిమగ్నమయ్యారు.
సంగెం : రుణమాపీ కాకపోతే పాలకమండలి మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు వెనుకాడదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 40శాతం వరకు పంట రుణాలుమాఫీ అయ్యాయి. ఇప్పుడెందుకు కావు. రాష్ట్ర ప్రభుత్వం రుణాలను మాఫీ చేయలేకనే సాంకేతిక లోపమని కారణాలు చూపుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఐక్యతతో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలని రైతులను కోరుతున్నా.
– సొసైటీ వైస్ చైర్మన్ ముడిదె శ్రీనివాస్
సంగెం : కాపులకనపర్తి సొసైటీలో పంట రుణాలు తీసుకున్న 1907 మంది రైతులకు తక్షణమే రుణాలను మాఫీ చేయాలి. అధికార పార్టీ నాయకులు వెంటనే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకపోవాలి. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో 13 గ్రామాల రైతులను కలుపుకొని అదే సొసైటీ ఎదుట పెద్దఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతాం. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం.
– దొనికెల శ్రీనివాస్, గవిచర్ల రైతు