నర్సింహులపేట, జూలై 5 : అరకొర వానలకు వేసిన పంటలు పండుతాయో.. ఎండుతాయో అనే ఆందోళనలో ఉన్న అన్నదాతకు యూరియా కష్టాలు తప్పడంలేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో మూడు రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షానికి పత్తి, మక్కజొన్న పంటకు యూరియా వేసుకుందామంటే కృతిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు.. దుక్కిమందు బస్తా కొంటేనే యూరి యా ఇస్తామని లింకు పెడుతున్నారు. సమయానికి యూరియా వేయకపోతే పంట ఎదుగుదల ఉండ దు. దీంతో రైతుల అవసరాన్ని అసరాగా చేసుకున్న దుకాణాదారులు, పీఏసీఎస్ అధికారులు దుక్కిమందు బస్తాలను బలవంతగా అంటగడుతున్నారు.
దీంతో తప్పని పరిస్థితిలో కొనుగోలు చేయాల్సి వస్తున్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఐదు యూరియా బస్తాలు కావాలంటే మూడు దుక్కిమందు సంచులు కొనాలంటుండడంతో ఆం దోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవసాధికారులు మాత్రం పట్టించుకోవం లేదని, నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ విషయమై ఏవో వినయ్‌కుమార్ మాట్లాడుతూ ఒక్కో రైతుకు మూ డు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తామని, దుక్కిమందు అంటగడితే చర్యలు తప్పవన్నారు.
నేను మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. పొలం నాటు వేసేందుకు కరిగట్టు చేశాను. పత్తికి యూరియా వేసేందుకు ఐదు బస్తాల యూరియా కావాలంటే మూడు బస్తాల 20-20-13 కొనాలంటున్నారు. దుక్కిమందు వద్దంటే యూరియా ఇవ్వమని చెబుతున్నారు. చేసేదేమీ లేక రూ. 3,900 అదనంగా ఖర్చు చేసి మూడు దుక్కిమందు బస్తాలు తీసుకోవాల్సి వచ్చింది.
– జాటోత్ రాజు, రైతు, దుబ్బతండా, నర్సింహులపేట
పత్తికి యూరియా వేద్దామంటే దుక్కి మందు బస్తా కొనాలంటున్నారు. ఎంత బతిమిలాడినా యూరియా ఇవ్వకపోతే చేసేది లేక దుక్కిమందు కొన్నా. యూరియా కోసం బలవంతంగా దుక్కిమందు అంటగడుతున్నారు. ఏవోకు చెప్పినా చూద్దాం.. చర్యలు తీసుకుంటాం అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
– జాటోత్ హట్య, రైతు, కొమ్ములవంచ