నర్సింహులపేట, జూలై 20 : బావులు, బోర్ల కింద నీటి ఆధారం ఉండడంతో వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు పెరిగిన కాంప్లె క్స్ ఎరువులు గుదిబండలా మారాయి. ఎక్కువగా ఉపయోగించే యూరియా, డీఏపీ ధరలో ఎలాంటి మార్పు లేకపోయినా పంటల ఎ దుగుదలకు, దిగుబడికి అత్యంత అవసరమైన కాంప్లెక్స్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక కాంప్లెక్స్ బస్తాకు రూ. 250 నుంచి రూ.700 వరకు పెరగడంతో అన్నదాత సాగు వైపు మొగ్గు చూపేందుకు వెనుకడుగు వేస్తున్నాడు. 20.20.13 గతంలో 1,550 ఉండగా, ఇప్పుడు 2,250 పెరిగింది.
అదే విధంగా 28.28.0 రూ. 1850 నుంచి రూ.2,300కు పెరిగింది. కష్ట మో.. నష్టమో కాంప్లెక్స్ బస్తాలు కొందామంటే, డీల ర్లు అవసరమైన డీఏపీకి రూ.1,300కు బదులు రూ.1,600కు అమ్ముతూ పైమందులు అంటగడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 28.28.0 స్టాక్ ఉన్నప్పటికీ పాత ధరకే అమ్మాల్సి వస్తుందని వెళ్లగొడుతున్నారని వాపోతున్నారు. స్టాక్ బోర్డుపై బస్తాలు ఉన్నట్లు చూపిస్తున్నా వ్యవసాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఏవో వినయ్‌కుమార్ వివరణ కోరగా రైతులను ఇబ్బంది పెట్టొద్దని, కాంప్లెక్స్ ఎరువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు, పైమందులు అంటగడితే చర్యలు తప్పవన్నారు.
పత్తి వేసి 20 రోజులు కావస్తుంది. మొలకలు వచ్చేందుకు నీటి తడులు ఇచ్చిన. ఇప్పుడు దుక్కి మందు వేసేందుకు వారం రోజులుగా తిరుగుతున్నా 28.28.0 బస్తాలు లేవంటున్నారు. అన్ని దుకాణాలు తిరిగినా లాభంలేదు. వ్యవసాధికారులను అడిగితే కాంప్లెక్స్ బస్తాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామంటున్నా ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు.
– ఎండీ ఖాజామెయినుద్దీన్, రైతు, నర్సింహులపేట
వాగు పక్కన నాకున్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల పొలం దున్నించిన. నారు పోసి నెల రోజులు కావస్తుంది. నాటు వేద్దామంటే డీఏపీ, 28.28.0 లేవంటున్నారు. రెండు రోజుల సంది తిరుగుతున్నా బస్తాలు దొరకడం లేదు. వేసవి కంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. భగవంతుడిపై భారం వేసి నాటు వేసేందుకు సిద్ధమైతే మందు బస్తాలు లేవంటున్నారు.
– గుగులోతు నరేశ్, రైతు, రూప్లాతండా