ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రుణమాఫీ కాక.. సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకోలేక.. అధికారుల చుట్టూ తిరగలేక నరకయాతన అనుభవిస్తున్నారు. అన్ని అర్హతలున్నా తమకు మాఫీ ఎందుకు వర్తించలేదని బ్యాంకులు, సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు.
ఆధార్ నంబర్ తప్పుగా ఉందని, పేర్లు సరిగా లేవని, రేషన్ కార్డు లేదనే సాకుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ రుణాలను రెన్యువల్ చేసుకున్నా రికార్డులో నమోదు చేయకపోవడంతో మాఫీకి దూరమయ్యామంటూ ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు మరోసారి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి కనపడుతున్నది. ఊరిలో సగం మందికి కూడా రుణమాఫీ వర్తించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 25 కొందరికేనా రుణమాఫీ?
నర్సింహులపేట, ఆగస్టు 25 : ‘కొందరికేనా రుణమాఫీ.. మాకెందుకు కాలేదు’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో సగం మందికి పైగా రుణమాఫీ కాలేదు. సుమారు 220 మంది ఎస్బీఐ, డీసీసీ, యూనియన్ బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్నారు. మూడు దఫాలుగా రుణమాఫీ చేసినా తమ పేర్లు లేవని, ఎందుకు కాలేదో ఎవరినడిగినా సమాధానం చెప్పడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ ఎందుకు కాలేదో తెలియడం లేదని, ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు.
నేను, నా భార్య కలిసి చెరో రూ. లక్షా 10 వేల పంట రుణం తీసుకున్నం. ప్రభుత్వం ఇస్తామన్న రూ. 2 లక్షలు మా ఖాతాలో జమ చేస్తే బ్యాంకులో ఉన్న మిగిలిన పైసలకు కలుపుకుని మల్ల లోను తీసుకుంటం. ముందుగా రూ. 2 లక్షలకు పైన ఉన్న పైసలు కట్టమంటే ఎక్కడ నుంచి కట్టాలే. అప్పు తెచ్చి లోన్ కడితే ప్రభుత్వం మాఫీ చేయకపోతే అప్పుడు మా గోస ఎవరు తీరుస్తరు. మూడు రోజుల సంది రైతువేదిక వద్దకు ఇద్దరం వస్తున్నాం. ఎవ్వలు ఏమీ చెప్పడంలేదు. జర అధికారులు మా గోసను ప్రభుత్వానికి చెప్పుండ్రు.
– జాటోత్ సీత-స్వరూప, మంగళితండా