వరంగల్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించింది. అందరికీ అన్నం పెట్టే రైతులను పోలీస్స్టేషన్లలో బంధించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఎలాంటి షరతులు లేకుండా పంట రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో అన్నదాతలు గురువారం చలో ప్రజాభవన్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని సగం మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయని రేవంత్ సర్కారు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మరిచి రైతులపై నిర్బంధ చర్యలు మొదలుపెట్టింది.
హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన రైతులను అక్రమంగా అరెస్టులు చేసింది. ప్రజాభవన్ కార్యక్రమానికి వెళ్తారనే అనుమానం ఉన్న ప్రతి రైతును పోలీసులు బుధవారం అర్ధరాత్రి నుంచే కట్టడి చేసింది. వరంగల్ పోలీస్ కమిషరేట్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలోని ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి కనీసం 10మందికి తగ్గకుండా రైతులను పోలీసులు అరెస్టులు చేశారు. రాత్రివేళ ఇళ్లకు వెళ్లి మరీ అదుపులోకి తీసుకోవడంపై కర్షకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిరోజు పంట పొలాల వద్దకు వెళ్లే రైతులు ఇలా కాంగ్రెస్ సర్కారు తీరులో పోలీస్‌స్టేషన్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఆ పార్టీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ పథకం వర్తించలేదు. రైతులకు లబ్ధి చేకూర్చడం కాకుండా పంట రుణాలు మాఫీ చేస్తే అయ్యే ఖర్చును తగ్గించేలా తిరకాసు పెట్టింది. రుణాలు తీసుకున్న వారి వివరాలు సేకరించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో సగం మంది రైతులకు కూడా రుణం మాఫీ కాలేదు. ప్రభుత్వం మొదట ప్రకటించిన లక్ష రూపాయల్లోపు రుణాల మాఫీకి అర్హులైన వారికి లబ్ధి కలగలేదు. రెండో దశ రుణమాఫీ ప్రక్రియలోనూ ఇదే జరిగింది. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకర్లను, అధికారులను అడిగినా ఫలితం లేకుండా పోయింది.
సహకార సంఘాల్లో రుణమాఫీ పూర్తిగా అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాంటి షరతులు లేకుండా పంట రుణాలను మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా ఎక్కడిక్కడ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. రైతుల నిరసనతో రాష్ట్ర సర్వే పేరుతో కాలయాపన చేసింది. రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారులకు వివరాలను, కుటుంబ ఫొటోలు ఇవ్వాలని సూచించింది. ఈ సర్వే పేరుతో రెండు వారాలు సాగదీసింది. సర్వే పూర్తయినా అర్హులైన రైతులకు పంట రుణాల మాఫీపై ఎలాంటి ప్రకటన చేయడంలేదు. రుణాలు మాఫీ కాని రైతులు ఆవేదనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. తాజాగా చలో ప్రజాభవన్ నిర్వహించాలని నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విధించింది. కార్యక్రమానికి వెళ్లేవారితోపాటు పొలాలకు వెళ్లే వారినీ పోలీస్స్టేషన్లలో, వారి ఇళ్లలో నిర్బంధించింది.