మహాదేవపూర్ (కాటారం ), ఏప్రిల్ 29: మంత్రి శ్రీధర్ బాబు సొంత మండలం కాటారంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డు ఎక్కి నిరసన తెలిపారు. మంగళవారం మంథని నియోజకవర్గం కాటారం మండలం రేగులగూడెం గ్రామంలో అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి చాలా రోజులు అవుతున్నా ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని – కాటారం మెయిన్ రోడ్డు పై ధర్నా చేపట్టారు.
వద్దురా నాయన.. కాంగ్రెస్ పాలన..అంటూ రైతులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని, రైతులు ఇబ్బంది పడుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో కనీసం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడం దారుణమన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.