రేవంత్ సర్కారు అందరికీ రుణమాఫీ చేయక రైతులను అరిగోస పెడుతున్న తీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏ ఊరిలో చూసినా బ్యాంకుల వద్ద బారులు, సొసైటీలు, వ్యవసాయ కార్యాలయాల వద్ద నిరసనలు, నిలదీతలు, తోపులాటలు, ప్రభుత్వంపై రైతుల ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న సమయంలో ఎమ్మెల్యేలెవరూ నియోజకవర్గ పర్యటనలకు వెళ్లేందుకు సాహసించడం లేదు.
అంతటా రుణమాఫీ కాని బాధితులే ఎక్కువ ఉండడంతో జనంలోకి వెళ్లేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. ఈ కాంగ్రెస్ సర్కారు వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం లేదన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు గ్రామాలకు వెళ్తే ఎక్కడ నిలదీస్తారోనని భయం వారిని వెంటాడుతున్నది. క్షేత్రస్థాయిలో తమకు ప్రతికూల పరిస్థితులున్నట్లు మండల, గ్రామస్థాయి నాయకుల ద్వారా తెలుసుకొని కొంతకాలం పర్యటనలను వాయిదా వేసుకోవడమే మంచిదని భావించి కేవలం పెళ్లిళ్లు, శుభకార్యాలకే పరిమితమవుతున్నారు.
– వరంగల్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పంట రుణాల మాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అందుకే నియోజకవర్గ పర్యటనలకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. ఏ ఊరికి వెళ్లినా సగం మందికి కూడా మాఫీ కాకపోవడంతో ఎక్కడ నిలదీస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎక్కడచూసినా రైతులు స్వచ్ఛందంగా వచ్చి బ్యాంకర్లను, వ్యవసాయ అధికారులను నిలదీస్తున్న సంఘటనలే కనిపిస్తున్నాయి.
గ్రామాల్లో పరిస్థితులు సర్కారుకు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయని, ఇప్పుడు ఎక్కడా పర్యటనలకు రావొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ మండల, గ్రామస్థాయి నాయకులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామాలకు వెళ్లి రైతులకు కనిపిస్తే తమను నిలదీస్తారని ఎమ్మెల్యేలు అధికార పర్యటనలను పూర్తిగా పక్కనబెట్టారు. రుణమాఫీ విషయంలో రైతులకు నష్టం జరగడంతో ఈ పరిస్థితి వచ్చిందని, ఎప్పటివరకు ఇది తొలగిపోతుందో అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు.
రైతుల అభిప్రాయం ఎలా ఉందని ప్రతిరోజు తమ వద్దకు వస్తున్న ద్వితీయ శ్రేణి నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ ఊరిలోనూ పావు వంతు మందికి రుణాలు మాఫీ కాలేదని, అంతటా ఇదే చర్చ జరుగుతున్నదని వారు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చినంక గత యాసంగిలో సాగునీళ్లు రాలేదని, ఇప్పుడూ ఇంకా రావడం లేదని.. రుణమాఫీ పూర్తి కాలేదని వివరిస్తున్నారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తిస్థాయిలో చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై గ్రామాల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందని చెబుతున్నారు.
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సప్తవర్ణ శోభితమై కనువిందు చేసింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ అధికంగా ఉండగా, సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనస్సు దర్శనమించ్చింది. ఈ దృశ్యం చూపరులను కట్టిపడేసింది. ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
-కాళేశ్వరం, ఆగస్టు 23
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ ప్రక్రియపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. నిబంధనల పేరుతో వ్యవసాయం చేసే వారిని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని అంటున్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ అని అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనల పేరుతో అన్యాయం చేసింది.
ఫలితంగా ఎక్కువ మంది ఈ పథకానికి దూరమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి రైతుకు రుణాలు మాఫీ చేసిందని, కాంగ్రెస్ సర్కారు మాత్రం పావు వంతు మందికే మాఫీ చేసిందని రైతులు చెబుతున్నారు. రేషన్‌కార్డును సాకుగా పెట్టి అర్హులకు అన్యాయం చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాఫీ కోసం వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మాఫీ పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేయాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 18న పంట రుణాల మాఫీ ప్రక్రియ మొదలుపెట్టింది. మొదటి దశలో లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేసినట్లు చెప్పింది. అదే నెల 30న రెండో దశ, ఆగస్టు 15న మూడో దశ మాఫీ ప్రక్రియను మొదలుపెట్టినట్లు చెప్పిం ది. మూడో దశ మాఫీ అయ్యే వరకు వేచి చూసిన రైతులు ఆందోళన బాట పట్టారు. బ్యాంకులకు వెళ్లి విసిగిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. రుణాలు మాఫీ చేసే వరకు ఊరుకునేది లేదని తెగేసి చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరు రైతులకు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే మంజూరైన కొన్ని పనుల శంకుస్థాపనలకు ఎమ్మెల్యేలను రావాలని అధికారులు కోరినా ఇప్పుడు కాదని, కొన్ని రోజులు ఆగాలని వాయిదా వేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలను పూర్తిగా పక్కనబెట్టారు. శ్రావణమాసం కావడంతో పెండ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు హాజరవుతున్నారు. అక్కడే సొంత పార్టీ క్యాడర్‌ను కలిసి మాట్లాడుతున్నారు. కలెక్టరేట్లో సమావేశాలకు హాజరవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నియోజకవర్గ కేంద్రాల్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల్లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.