నమస్తే తెలంగాణ నెట్వర్క్ : అన్నదాత కడుపు మండింది. కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక రోడ్డెక్కి ఆ పంటనే తగలబెట్టి నిరసన తెలిపే దుస్థితి వచ్చింది. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొంటారంటూ కాంగ్రెస్ సర్కారు తీరుపై రైతుల ఆక్రోశం కట్టలు తెంచుకున్నది. శుక్రవారం జనగామ జిల్లా పెంబర్తిలో ధాన్యం బస్తాలు, జఫర్‌గఢ్‌లో మక్కల బస్తాలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్, దేవరుప్పులలోని మిల్లుకు మక్కల లోడ్ ట్రాక్టర్లతో వచ్చిన రైతులు ఎర్రటి ఎండలో పడిగాపులుగాచారు. పంటలను అమ్ముకొనేందుకు అరిగోస పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలని కోరారు.
డ్డెక్కారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలుదాటినా కొనుగోళ్లు చేయడం లేదని ఆగ్రహించారు. పట్టించుకునే దిక్కులేక కడుపు మండిన రైతులు శుక్రవారం జనగామ మండలంలోని పెంబర్తి గ్రామంలోని వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవేపై ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కేంద్రాలకు లారీలు పంపి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలని అధికారులను కోరినా పట్టించుకోకపోవడంతో 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు, అక్కడే తాము పడిగాపులుగాస్తున్నామన్నారు. కొనుగోళ్ల విషయంలో పూర్తిగా జిల్లా యంత్రాంగం విఫలమైందని,ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలను తరలించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులతో మాట్లాడారు. లారీలు కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. లారీలు రాకపోతే నేషనల్ హైవేను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
జఫర్‌గఢ్‌లో రోడ్డుపై చెట్ల కొమ్మలు వేసినిరసన
జఫర్‌గఢ్, మే 15 : మక్కల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహించిన అన్నదాతలు జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో రోడ్డుపై మక్కలను తగులబెట్టి నిరసన తెలిపారు. జఫర్‌గఢ్- వర్ధన్నపేట ప్రధాన రహదారిపై చెట్ల కొమ్మలు అడ్డుగా వేసి అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఐకేపీ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని నెల రోజుల కిందట జఫర్‌గఢ్ శివారు నల్లబండ ప్రాంతంలో ప్రారంభించిన కొ నుగోలు కేంద్రానికి పెద్ద ఎత్తున మక్కలు తీసుకొచ్చినట్లు తెలిపారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నా ఏఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధి గానీ పట్టించుకోకపోవడంతో ఎక్కడ పోసిన మక్కలు అక్కడే కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయన్నారు. గన్నీ సంచులు రాకపోవడంతో సొంత ఖర్చుతో కొనుగోలు చేసి బస్తాల్లోకి నింపినా కాంటాలు వేయక, బస్తాలను తరలించకపోవడంతో కడుపు మండి మక్కలను రోడ్డుపై పోసి తగులబెట్టినట్లు తెలిపారు. జఫర్‌గఢ్- వర్ధన్నపేట ప్రధాన రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమించారు. ప్రభుత్వం వెంట నే మక్కలు కొనుగోలు చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.