నర్సింహులపేట/దంతాలపల్లి : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పొలాలు చివరి దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అన్నదాతలకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. నర్సింహులపేట మండలం బాసుతండా జీపీ పరిధిలో ని మంగళితండాకు చెందిన నేతావత్ లక్ష్మి రెండు ఎకరాల్లో వరి పొలం వే యగా, కిక్కి దశలో సాగునీళ్లు అందక తెల్లబారిపోతున్నది. వరి గింజలు తాలుగా మారుతున్నాయి. ఇప్పటికే సుమారు రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టానని, 60 ఫీట్లు లోతు ఉన్న బావిలో నీరు లేక ఒక్క మడికూడా పారడం లేదని ఆవేదన వ్యక్తం చేసిం ది.
ఇంత కష్టపడినా చివరి దశలో తాలే మిగిలే అవకాశం ఉందని లక్ష్మి కన్నీటిపర్యంతమైంది. అదే తండాకు చెందిన జాటోత్ లచ్చిరాం రెండు ఎకరాల పొలంతోపాటు మిరుప పంటకు సాగు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని, ఎన్నికల ముందు కాల్వలు తీస్తామని హామీఇచ్చి ఓట్లు వేయించుకున్న నాయకులు, గెలిచిన తర్వాత ఇప్పుడు కంటికి కనిపించడం లేదన్నారు. దంతాలపల్లి మండలంలోని రామానుజపురం, వేములపల్లి, దోనకొండ గ్రామాల పరిధిలో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి పొలాలు నీరు అందక ఎండిపోతున్నాయి.
రామానుజపురం గ్రామానికి చెందిన మల్లం వెంకన్న బోరు కింద రెండు ఎకరాల్లో వరిసాగు చేశాడు. బోరులో ఊటలు తగ్గి సాగునీరు అందక చేతికొచ్చిన ఎకరం పంట ఎండిపోవడంతో పశువులను మేపుతున్నాడు. వేములపల్లి, దొనకొండకు చెందిన రైతులు సందు లిగయ్య, సందు ఐల్లయ్య, జటంగి మల్లయ్య, దడిగెల వెంకన్నతో పాటు మరో పది మంది రైతులకు చెందిన సుమారు 40 ఎకరాల్లో వరి ఎండిపోవడంతో పశువులు, గొర్రెలకు వదిలిపెట్టారు. ఎస్సారెస్పీ నీరు విడుదల చేయకపోవడంతోనే పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేల రూపాయలు అప్పు తెచ్చి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.