దేవరుప్పుల, ఫిబ్రవరి 9 : ఇప్పటివరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు వినియోగించే ఈ నిఘా నేత్రం ఇప్పుడు పంట పొలాలకూ విస్తరించింది. నేర పరిశోధన, విచారణలో పోలీసులు విరివిగా వాడే సాంకేతిక సాధనం ఇదొక్కటే. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపూర్లో తొలుపునూరి రమేశ్ అనే రైతు దొంగల బెడద నుంచి తప్పించుకునేందుకు తన వ్యవసాయ క్షేత్రానికి నాలుగు దిక్కులా ఎనిమిది సీసీ కెమెరాలు అమర్చాడు.
ఈ రోజుల్లో దొంగలు వ్యవసాయ మోటర్ల స్టార్టర్లు, కాపర్ వైర్లు, ఇతర పనిముట్లనే గాక ఇంకో అడుగు ముందుకేసి ట్రాన్స్ఫార్మర్ను సైతం రాత్రిరాత్రికి విప్పి ఎత్తుకెళ్లడం సాధారణమైపోయింది. అంతేగాక భూ తగాదాల కారణంగా హద్దుల్లో పాతిన ఫెన్సింగ్లను తొలగించడం గొడవలకు దారి తీస్తోంది. తనకు ఎదురైన అనుభవాలతో విసిగిపోయిన రమేశ్ ఇక వీటికి సీసీ కెమెరాలే పరిష్కారమని భావించి తన పొలం చుట్టూ కరెంటు స్తంభాలకు, తాటిచెట్లకు ఇలా సోలార్ సిస్టంతో నడిచే సీసీ కెమెరాలను అమర్చాడు.
నా వ్యవసాయ క్షేత్రంలో స్టార్టర్ ఎత్తుకెళ్లారు. భూతగాదాల వల్ల రాత్రికి రాత్రే ఫెన్సింగ్ రాళ్లు తొలగించారు. దీనిపై పోలీస్స్టేషన్లో కేసు పెడితే ఎలా రుజువు చేస్తావని అడిగారు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనలకు తాను ఎలా సాక్ష్యం చూపిస్తానని చెప్పిన. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కొందరి సూచనల మేరకు ఇలా సీసీ కెమెరాలు పెట్టా. – తొలుపునూరి రమేశ్, రైతు, సీతారాంపూర్