హస్తకళలకు ప్రసిద్ధి అయిన పెంబర్తి జాతీయ స్థాయిలో మెరిసింది. 2023 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. తెలంగాణ నుంచి రెండు గ్రామాలు ఎంపికవగా వీటిలో పెంబర్తి తొలిస్థానంలో ఉన్నది. మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా ఇక్కడ రూపుదిద్దుకునే కళాకృతులు ఇక్కడి కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. కాగా ఏటా 25వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర సర్కారు లెక్కలు చెబుతున్నాయి. ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిలీల్లో అవార్డు ప్రదానం చేయనుండగా ఉమ్మడి జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– జనగామ రూరల్, సెప్టెంబర్ 25
హస్తకళలకు ప్రసిద్ధి అయిన పెంబర్తి, దేశంలోనే ఉత్తమ పర్యటక గ్రామంగా ఎంపికైంది. జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తి కాకతీయ కాలం నుంచీ హస్తకళలకు పెట్టింది పేరుగా గుర్తింపు పొందింది. ఉమ్మడి జిల్లాకు ముఖద్వారమైన ఈ ఊరిలో తయారయ్యే వెండి, ఇత్తడి, కంచు కళారూపాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు ఇక్కడి కళాకృతులను దిగుమతి చేసుకుంటున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులులెన్నో ఇక్కడి కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటాయి.
ఇక్కడి విశిష్టతను తెలుసుకునేందుకు, వస్తువులను కొనుగోలు చేసేందుకు ఏటా 25వేలమంది పర్యాటకులు పెంబర్తికి వస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వ లెక్కలు చెడుతున్నాయి. అనేక రకాల కళాకృతుల తయారీ, వాటి విక్రయాల ద్వారా ఉపాధి పొందుతున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామాన్ని అవార్డుకు ఎంపిక చేసింది. అనేక ఆలయాలకు దర్వాజలు, ఇంటిని అలంకరించుకునే వస్తువులను పర్యాటకులు ఇక్కడే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇత్తడి, వెండి, కంచుతో అందంగా ఆకర్షణీయంగా తయారైన కళాకృతులు విశేషంగా ఆకట్టుకుంటాయి. తెలంగాణ నుంచి రెండు గ్రామాలు జాతీయ అవార్డుకు ఎంపిక కాగా, వీటిలో పెంబర్తి తొలిస్థానంలో ఉన్నది. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున ఢిల్లీలో ఈ అవార్డును అందించనున్నారు.
చాలా సంతోషంగా ఉంది
జిల్లాలోనే పెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న పెంబర్తి, అన్ని రంగాల్లో ముందుకుపోతున్నది. ఇటివల గ్రామానికి స్వచ్ఛసర్వేక్షణ్లో జిల్లాస్థాయి అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు దేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో గ్రామానికి దేశవ్యాప్తంగా కీర్తి దక్కినట్లయింది. మా ఊరిని పర్యాటకంగా మరింత తీర్చిదిద్దేందుకు ఉత్సాహంగా పనిచేస్తాం.
-అంబాల ఆంజనేయులు గౌడ్, సర్పంచ్, పెంబర్తి