కరీమాబాద్, జనవరి 26 : వారంతా పొట్టకూటి కోసం ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి బతుకుతున్నారు. పనిచేసేందుకు మరోప్రాంతానికి వెళ్తుండగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. కళ్ల ముందే తమ కుటుంబ సభ్యుల మృతిని చూసి ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. ఇనుప స్తంభాల మధ్య ఉన్న తన భర్త.. కూతుళ్లను చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. కొనఊపిరితో ఉన్న కొడుకును తన ఒడిలో పెట్టుకొని ఆపన్న హస్తం కోసం ఎదురుచూసింది.
తలలు పగిలి.. ఎముకలు విరిగి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనను చూసిన వారి హృదయాలు చలించిపోయాయి. లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలిసింది. వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ రాష్ర్టానికి సంతోష్, అత డి భార్య చమాభాయ్, కుమారులు ముకేశ్, కన్నా, కుమార్తెలు పూజ, కిరణ్ కొంతకాలంగా మామునూరులో కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. పొట్టకూటి కోసం తమ సామగ్రిని సర్దుకొని ఆదివారం ఆటోలో వరంగల్ వైపుగా వెళ్తున్నారు. అదేవైపుగా ఇనుప స్తంభాల లోడుతో వైజాగ్ నుంచి రాజస్థాన్‌కు ఓ భారీ లారీ వెళ్తూ మామునూరు బెటాలియన్‌కు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది.
కొద్దిదూరం వరకు ముందుకు వెళ్లింది. దీంతో అందులో ఉన్న ఇనుప స్తంభాలు అదే దారిలో వెళ్తున్న 2 ఆటోలపై పడ్డాయి. దీంతో రెండు ఆటోలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో ఓ ఆటోలో 7 గురు ఉండగా మరో ఆటోలో డ్రైవర్ ఉన్నాడు. ఒక్కసారిగా ఇనుప స్తంభాలు ఆటోలపై పడడంతో అందులో ఉన్న సంతోష్ (48), పూజ (20), కిరణ్ (20) కన్నా (7) అక్కడికక్కడే మరణించగా, ముకేశ్, ఆటో డ్రైవర్లు షకీర్, సాగర్ తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న కారుకు సైతం ఇనుప స్తంభాలు తాకగా పాక్షికంగా దెబ్బతింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదే హాలను మార్చురీకి తరలించి క్షతగాత్రులను ఎంజీఎం దవాఖానకు తరలించారు.
ఇనుప స్తంభాలు ఆటోలతో పాటు రోడ్డుపై అడ్డంగా పడడంతో మామునూరు రహదారిపై రాకపోకలు స్తం భించాయి. క్రేన్లు, జేసీబీల సా యంతో డీసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు దాదాపు 3 గంటల పాటు శ్రమించి ఇనుప స్తంభాలు, లారీని పక్కకు జరిపి రాకపోకలు ప్రారంభించారు. వారికి ప్రజలు సైతం సహకరించారు. ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను దారి మళ్లించారు.
కలెక్టర్ సత్య శారదాదేవి, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా, నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్యాధికారి ఘటనా స్థ లానికి చేరుకుని పరిశీలించారు. కలెక్టర్ బాధిత కుటం బ సభ్యులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎంజీఎం దవాఖానకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందజేయాలని ఎంజీఎం అధికారులు, సిబ్బందికి సూచించారు.
వరంగల్‌చౌరస్తా: మృతుల కుటుంబాలను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎంజీఎం దవాఖాన మార్చురీకి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కుటుంబాలను ఓదార్చి, ఆర్థికసాయం అందజేశారు. క్షతగాత్రులను కలిసి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు ప్రభు త్వం తరఫున అందాల్సిన సహాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.